Friday, November 15, 2024

నేపాల్‌ వీధుల్లోనే రాత్రంతా జనం..

- Advertisement -
- Advertisement -

ఖాట్మాండూ : భూకంప విలయం ధాటికి అతలాకుతలం అయిన నేపాల్‌లో వేలాది మంది శనివారం రాత్రి అంతా వీధుల్లోనే గడపాల్సి వచ్చింది. ముందుగా అత్యంత తీవ్రస్థాయి భూకంపం రావడం తరువాత వరుసగా రెండు వందల సార్లు అనంతర ప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం నిరాశ్రయులు అయ్యారు. పలు చోట్ల కుప్పకూలిన ఇళ్లు, పగుళ్లు వారిన వీధులతో పరిస్థితి భయానకంగా ఉంది. ఎక్కడైనా తలదాచుకుంటే ఎప్పుడు తిరిగి భూమి కంపిస్తుందో అనే వణుకుతో జనం ఎముకలు కొరికే చలి మధ్యనే దిక్కుతోచని స్థితిలో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ నిద్రకు ఉపక్రమించారు. తీవ్రస్థాయి భూకంపం పశ్చిమ నేపాల్‌ను కుదిపేసింది. ఈ క్రమంలో 157 మందికి పైగా మృతి చెందారు. వందలాదిగా గాయపడ్డారు. వేలాదిగా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తీవ్రస్థాయి భూకంపం ఇప్పటికీ తనకు వణుకు పుట్టిస్తోందని శనివారం రాత్రి అంతా కునుకు పట్టలేదని భావన పన్ అనే మహిళ తెలిపింది. శుక్రవారం రాత్రి భూకంపంతో తమకు మెలకువ వచ్చిందని, అప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని తెలిపారు. పక్కనే పూర్తిగా పగుళ్లు వారి ఉన్న ఇంట్లోకి వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప ప్రధాన కేంద్రం నెలకొన్న జజర్కోట్, రుకుం జిల్లాలు విధ్వంసానికి గురయ్యాయి.

వేలాది జనం రోడ్ల పాలయ్యారు. ఇప్పటికిప్పుడు విదేశాల నుంచి సాయం తీసుకునే నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితిని బట్టి దీనిపై ఆలోచిస్తామని నేపాల్ ప్రధాన మంత్రి ప్రచండ తెలిపారు. శనివారం ఆయన ఉన్నత స్థాయి బృందంతో కలిసి భూకంప తాకిడి ప్రాంతాలలో పర్యటించారు. చైనా ఇతర దేశాలు భారీ స్థాయిలో ఆర్థిక సాయానికి ముందుకు వచ్చాయి. పొరుగున ఉన్న భారతదేశం అత్యవసరంగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. గాలింపు, సహాయక చర్యలు సాగుతున్నాయి. వెనువెంటనే విదేశీ సాయం తీసుకునే తొందరేమీ లేదని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. తాము స్వయంగా ఈ వైపరీత్య పరిణామాన్ని తట్టుకుని , ప్రజలను ఆదుకునే శక్తితో ఉన్నామని ప్రభుత్వ కార్యదర్శి ఒక్కరు ఖాట్మాండు పోస్టు ప్రతినిధితో తెలిపారు. సహాయక చర్యలకు అవసరం అయిన పూర్తి స్థాయి సామాగ్రి తమ వద్ద ఉందని వివరించారు. కాగా ఆదివారం నేపాల్ ప్రధాని ప్రచండ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరిగింది.

ప్రస్తుత పరిస్థితిని, తీసుకోవల్సిన చర్యలను , ప్రజలకు తక్షణ రిలీఫ్ గురించి విశ్లేషించారు. బాధితులకు తక్షణ సాయం కోసం బాధిత రెండు జిల్లాలకు రూ 50 మిలియన్ల చొప్పున ఆర్థిక సాయం కల్పించాలని నిర్ణయించారు. మరో వైపు విపత్తు నివారణ పర్యవేక్షణల కమిటీ కూడా సమావేశం అయింది. భూకంపం తరువాతి ప్రకంపనలతో పలు చోట్ల బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో సహాయ పునరావాస బృందాలు వెనువెంటనే సాయం అవసరం అయిన ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి.
చియురి గ్రామంలో సామూహిక అంత్యక్రియలు
భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న జజర్కోట్ జిల్లాలో పలు గ్రామాలలో విషాదకర పరిస్థితి ఏర్పడింది. చియురి గ్రామంలో అత్యధిక సంఖ్యలో ఇళ్లు కూలాయి. ఇప్పుడు తాము సామూహిక ఖననానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని చియురి గ్రామస్తుడు లాల్ బహదూర్ బికా తెలిపారు. తెల్లటి దుస్తులలో కప్పి ఉంచిన 13 మృతదేహాలను చూపిస్తూ, వీరిని ఖననం చేయాల్సి ఉందన్నారు. ఆదివారం ఉదయం ఇక్కడ పలు ప్రాంతాలలో ఖననాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంత్యక్రియలు జరిపించడం, మిగిలిన వారి బాగోగులు చూసుకోవడం తమ పని అయిందని స్థానికులు కొందరు తెలిపారు. శనివారం రాత్రి చాలా మంది ప్లాస్టిక్ షీట్లు, గోనె సంచులు , పాత బట్టలతో చలిని తట్టుకుంటూ గడిపారు. ఇళ్లలోని సామాన్లు చాలా వరకూ శిథిలాల కింద కూరుకుపోయి ఉండటంతో వీటిని తీసుకోవడం కష్టం అవుతోంది. నిద్రలో ఉన్నప్పుడే తాము నేలలోకి కూరుకుపోయ్యామని, భూమి నిమిషాల పాటు కంపించిందని చేతికి గాయపు కట్టుతో టికా రామ్ రానా బాధతో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News