Saturday, December 21, 2024

వారానికి 70 పని గంటలు

- Advertisement -
- Advertisement -

ఇన్ఫోసిస్ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణమూర్తి యువత భారత్‌ను తమ సొంత దేశంగా భావించాలని, దేశ ప్రగతి కోసం వారానికి 70 గంటల పాటు శ్రమించాలని ఇటీవల ఒక విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనను వివిధ కోణాల్లో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ట్రేడ్ యూనియన్ కోణం, ఆరోగ్య కోణం, సామాజిక కోణం, ఉత్పత్తిపై సాంకేతిక అభివృద్ధి ప్రభావ కోణం నుండి. సుదీర్ఘ పోరాటం ఫలితంగా కార్మికులు ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటలు నిద్ర, మిగిలిన ఎనిమిది గంటలు కుటుంబం కోసం, వినోద వికాసాల కోసం చట్టబద్ధమైన హక్కును పొందగలిగారు.

అంతర్జాతీయంగా అంగీకరించిన కాల పరిమితికి విరుద్ధంగా వున్నందున వారానికి 70 గంటల పనిని కార్మిక సంఘాలు తిరస్కరించాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఒ) ప్రకారం భారత దేశంలో ప్రజలు పని పై ఎక్కువ సమయం గడుపుతారు కాని తక్కువ వేతనం పొందుతారు. అంటే కార్మికులను విపరీతంగా దోపిడీ చేయడం, చట్టాన్ని ఉల్లంఘించడం జరుగుతోంది. ఇది సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటికీ వర్తిస్తుంది. ఉదాహరణకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్, వందే భారత్ వంటి ప్రత్యేక రైళ్లలో క్యాటరింగ్ సేవల్లో పని చేసే సిబ్బంది అతి తక్కువ జీతంతో రోజుకు దాదాపు 18 గం. పని చేస్తు న్నారు. స్వీట్ మీట్ షాపుల్లో పని చేసే లక్షలాది మంది లేదా గిగ్ వర్కర్లు కూడా ప్రతి రోజూ దాదాపు అంత సమయం పనిలో గడుపుతారు. నూతన సాంకేతిక అభివృద్ధితో కంపెనీల ఉత్పత్తి అనేక రెట్లు పెరిగింది, లాభాలు కూడా పెరిగాయి, కానీ లాభాలు మాత్రం కార్మికులకు అందడం లేదు.

అధిక పని గంటల వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాన్ని అధ్యయనం చేయడం కూడా చాలా ముఖ్యం. కార్మికులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటే ఉత్పాదకత పెరుగుతుందనేది జగమెరిగిన సత్యం. అలసిపోయిన వ్యక్తి ఎప్పుడూ మెరుగైన ఉత్పత్తిని ఇవ్వలేడు. వారు ఏకాగ్రత కోల్పోతారు. పనిలో తప్పులు చేస్తారు, ఎక్కువ ప్రమాదాలకు గురవుతారు. మన జీవశక్తి వరుసగా 8 గంటలు ఉత్పాదకంగా ఉండలేదు. ముఖ్యంగా ‘సిర్కాడియన్ రిథమ్’ అని పిలువబడే దానివల్ల మన రోజువారీ జీవచక్రాలు పగలు, రాత్రి భిన్నంగా వుంటాయి. పరిస్థితులకు మన శరీరం ఎలా స్పందిస్తుంది అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన హార్మోన్లు, మన ఆహారం, సూర్యరశ్మి లో గడిపిన సమయం ఇత్యాది అనేక అంశాలు మన శరీర స్పందనను ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు- మనలో చాలా నిర్దిష్టమైన జీవ లయ వుందని కనుగొన్నారు. అందువలన, మేధోపరంగాను, శారీరకంగాను రోజులోని కొన్ని సమయాల్లో మనం మరింత చురుకుగా, ఉత్పాదకంగా ఉంటాము. ఈ రోజుల్లో చాలా మంది యువకులు చేస్తున్న కంప్యూటర్ స్క్రీన్లపై పని చేయడం కావొచ్చు, శారీరకంగా కాయకష్టం చేయడం కావొచ్చు వారందరినీ ఈ రిథం ప్రభావితం చేస్తుంది.

పని దినం మొత్తం సమయంలో తమ ఉద్యోగులు చురుకుగా వుండాలని ఉత్తమశ్రేణి ఉత్పాదకతను సాధించాలని మేనేజర్లు ఆశించినప్పటికీ ఇది అవాస్తవమైన అంచనా. ఉద్యోగులు కూడా అన్ని సమయాల్లో వారి ఉత్తమమైన సమర్థతతో పని చేయాలని కోరుకోవచ్చు, కానీ వారి సహజ సిర్కాడియన్ లయ వల్ల అన్ని వేళలా ఇది సాధ్యంకాదు. కోరిక, సమర్ధతల మధ్య అన్ని సమయాల్లో ఒకే విధమైన పొంతన కుదరక పోవచ్చు. 25 సెప్టెంబర్ 2017న యూమేటర్‌లో ప్రచురించబడిన ‘తక్కువ పని దినాలు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరింత ఉత్పాదకరమైన జీవితానికి రహస్యమా?’ అనే వ్యాసం ప్రకారం రోజుకు 8 గంటలకు పైగా కార్యాలయంలో ఉండడం పేలవమైన ఆరోగ్యంతో ముడిపడి ఉంది. గుండె జబ్బులు లేదా ఒత్తిడి సంబంధిత వ్యాధులు సంభవించే అవకాశం 40% ఎక్కువ అవుతుంది. కార్మికులకు రోజువారీ పని సమయం సుమారు 6 గంటలు అదీ ఉదయం ఎక్కువ అనువైనదిగా వుంటుందని శాస్త్రవేత్తలు సాధారణంగా అంగీకరిస్తారు.

ఇన్సూరెన్స్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అతిగా పని చేయడం వల్ల గాయపడే ప్రమాదం 61 శాతం పెరుగుతుంది. అలాగే డయాబెటిస్, ఆర్థరైటిస్, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అధిక పని వల్ల మన శారీరక ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని కూడా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) నుండి ఒక అధ్యయనం ప్రకారం ప్రతి వారం సగటున 35 -40 గంటలు పని చేసే వారితో పోలిస్తే 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయడం వల్ల మీకు స్ట్రోక్ ప్రమాదం 35%, గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 17% పెరుగుతుంది,.
అతిగా పని చేయడం వల్ల మనలో ఉత్సాహం తగ్గుతుంది. నిస్తేజం కమ్ముకుంటుంది. పని సమయంలో ఒత్తిడి పెరిగి ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక అధ్యయనం ప్రకారం ఎక్కువ గంటలు పని చేసే వ్యక్తులు తీవ్రమైన నిస్పృహలోకి జారిపోవడానికి రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉంది.

ప్రత్యేకించి రోజుకు 11 గం. కంటే ఎక్కువ పని చేస్తే ఈ ప్రమాదం పెరుగుతుంది. ఉద్యోగులను ప్రేరేపించడానికి, సంతృప్తిపరచడానికి పని ప్రాం తంలో శ్రమ సంస్కృతి కీలకమైనది. పని చేయడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించడం, ఉద్యోగులను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన శ్రామిక శక్తి, అనుకూలమైన వాతావరణం లేకుండా పనిలో తలెత్తే ప్రమాదాల నుండి తగిన రక్షణ ఏర్పాట్లు లేకుండా, భద్రత, ఆరోగ్యానికి హామీ లేకుండా, పని ప్రాంతాలు వుంటే ఉత్పాదకత తీవ్రంగా దెబ్బ తింటుందని, ఇది దేశం, సమాజం, చివరకు యజమానుల ప్రయోజనాలకు కూడా హాని కలిగిస్తుందని నిర్ణయాలు తీసుకునే వారు గ్రహించాలి.

ఉత్పాదకతకు అదనపు పని గంటలు ముఖ్యం కాదని, అనుకూలమైన వాతావరణంలో పని చేసే సంతోషకరమైన, ఆరోగ్యకరమైన వ్యక్తి ఉత్పాదకతను పెంచగలడని నారాయణ మూర్తి గ్రహించాలి. మన దేశంలో లక్షలాది మంది తమ నైపుణ్యాలకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని, సరైన ప్రణాళికతో వారి సేవలను, సమర్థతలను సామాజిక ప్రగతి కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం వున్నదని తెలుసుకోవడం ముఖ్యం. నారాయణమూర్తి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కార్మికుల వేతనాల గురించి మాట్లాడి, కంపెనీల నిజమైన లాభాలతో సరిపోల్చి ఉండాల్సింది. పన్నులు ఎగ్గొట్టి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని వారి వల్ల, గత పదేళ్లలో బ్యాంకుల ఎన్‌సిఎ రూ. 25 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన చెప్పి వుంటే బాగుండేది. దేశ ప్రగతికి అడ్డుపడుతున్న ఇలాంటి అంశాలను వదిలివేసి పని గంటలు పెంచాలని సలహా ఇవ్వటం సరైనదేనా నారాయణ మూర్తి గారూ?

డా. జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News