బంగ్లాదేశ్ తో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ కావడంపై ఇప్పుడు ఎక్కడ చూసినా రసవత్తరమైన చర్చ జరుగుతోంది. కాకలు తీరిన అభిమానులకు కూడా క్రికెట్లో ఇలాంటి నిబంధన ఒకటి ఉన్నట్లు తెలియకపోవడంతో నోరువెళ్లబెట్టాల్సి వచ్చింది. ఆ వెంటనే తేరుకుని, టైమ్డ్ ఔట్ అంటే ఏంటి, ఎలాంటి సమయాల్లో ఔటవుతారు వంటి వివరాలన్నీ గూగుల్ తల్లిని అడిగి తెలుసుకున్నారు. నిజానికి అంతర్జాతీయ క్రికెట్లో ఇలా టైమ్డ్ ఔట్ అయిన మొట్టమొదటి ఆటగాడు మ్యాథ్యూస్ మాత్రమే. అయితే దేశవాళీ క్రికెట్లో ఇలాంటి ఆటగాళ్లు మరో ఆరుగురు ఉన్నారని కూడా అదే గూగుల్ తల్లి చెబుతోంది.
ఆ సంగతి అలా ఉంచితే, రాజకీయాల్లో టైమ్డ్ ఔట్ అయిన నాయకుల గురించి ఎవరూ పట్టించుకోకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అదేంటి? రాజకీయాల్లో టైమ్డ్ ఔట్ కావడమేంటి అనేగా మీ సందేహం?. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయాల్లోనూ ఇలా టైమ్డ్ ఔట్ అయ్యే నేతలు ఉంటూ ఉంటారు. అంతెందుకు? తాజాగా జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లోనూ ఇలాంటి నాయకులులున్నారు తెలుసా?. వారిలో ముందుగా చెప్పుకోవలసింది చంద్రబాబు గురించి. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ముందు నుంచీ ప్లాన్ వేసుకున్నారు. అందులో భాగంగా కాసాని జ్ఞానేశ్వర్ కి తెలంగాణ టిడిపి పగ్గాలు అప్పగించి, పార్టీని ‘ఆ విధంగా ముందుకు తీసుకుపొమ్మ’న్నారు. తీరా ఎన్నికలొచ్చేసరికి, ఆయన జైల్లో ఉండటంతో, ఈసారికి పోటీ చేయకూడదని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో ఇది ‘టైమ్డ్ ఔట్’ కిందే లెక్క కదా.
ఇక మరొకరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు షర్మిల. రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ తెలంగాణకొచ్చి, పాదయాత్రలు, నిరసన ప్రదర్శనలు జరుపుతూ అంతో ఇంతో హడావిడి సృష్టించిన నాయకురాలు ఆమె. పాలేరు నుంచి బరిలోకి దిగుతానంటూ ఢంకా బజాయించి చెప్పారు కూడా. దీంతో ఖమ్మం జిల్లాలో సీట్లను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొల్లగొడుతుందేమోనని పెద్ద పెద్ద పార్టీలు కూడా కాస్త కంగారుపడ్డాయి. ఎన్నికలు వచ్చేసరికి, పొత్తుల పేరిట కాంగ్రెస్ ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపింది. పొత్తు కుదరకపోవడంతో, ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని అందరూ భావించారు. అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ షర్మిల.. ఈసారి తమ పార్టీ పోటీ చేయట్లేదని, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఇది కూడా ఒక రకంగా టైమ్డ్ ఔటే.. కాదంటారా?.