కొత్తగూడెం: అధికార భారత రాష్ట్ర సమితి పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. మంత్రి కెటిఆర్ సమక్షంలో కొత్తగూడెం సిపిఐ కౌన్సిలర్లు బిఆర్ఎస్ లో చేరారు. కౌన్సిలర్లకు కెటిఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… బిఆర్ఎస్ సిద్ధాంతాలు, కెసిఆర్ ఆశయాలు నచ్చి పార్టీలోకి వచ్చే వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. వనమా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ… తెలంగాణ రథసారధిగా తెలంగాణ జాతిపితగా కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యావత్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలు నచ్చి బిఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా వారు ప్రకటించారు. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు రాజకీయాలకు అతీతంగా నిరంతరం చేస్తున్న అభివృద్ధి పనులు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చే వారి నాయకత్వంలో పనిచేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, వారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా శ్రమిస్తామని వారి సారధ్యంలో కొత్తగూడెంలో మా వార్డుల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి, కౌన్సిలర్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాసరెడ్డి, ఒకటో వార్డు కౌన్సిలర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోయిన విజయ్ కుమార్, 18 వ వార్డు కౌన్సిలర్ పి. సత్యనారాయణ చారి, 16 వ వార్డు కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి, 30 వ వార్డు కౌన్సిలర్ నేరేళ్ల సమైక్య, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ మాచర్ల శ్రీనివాస్, ఏఐటియుసి పట్టణ కన్వీనర్ పిడుగు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.