న్యూఢిల్లీ : బిజెపి దిగ్గజ నేత లాల్‌కృష్ణ అద్వానీ (ఎల్‌కె అద్వానీ) 96వ సంవత్సరంలోకి అడుగిడారు. అద్వానీ 96వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు ఇతర నేతలు బుధవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజకీయాలలో మూడు తరాల వారధిగా అద్వానీకి పేరుంది. ఆయన అంకితభావం , సమగ్రత , దార్శనిక నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని నేతలు కొనియాడారు. దేశ ప్రగతి, ఐక్యతలను ఆయన ఇనుమడింపచేశారని, అన్ని విధాలుగా కాంతిపుంజంగా మారారని పేర్కొన్నారు. బిజెపిలో సీనియర్ నేత అయిన అద్వానీ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడా ప్రజల ముందుకు రావడం లేదు. దేశ మాజీ ప్రధానిగా, బిజెపి అధ్యక్షులుగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఎక్స్ సామాజిక మాధ్యమంలో ప్రధాని మోడీ తమ గ్రీటింగ్స్ తెలిపారు. ఆయన సేవలు దేశానికి ఉపయుక్తంగా మారాయని, ఆయనకు సంపూర్ణ ఆయుష్షు, మంచి ఆరోగ్యం ఆశిస్తున్నట్లు స్పందించారు.
140 కోట్ల మంది భారతీయులకు ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో అద్వానీ బిజెపికి ఆరంభం నుంచి అధికార స్థాపన వరకూ పలు విధాలుగా తమ సేవలు అందించారని, వ్యవస్థాగత నేర్పు, అవిశ్రాంత కఠిన పనితీరు వల్ల బిజెపి ఈ రోజు పురోగమించిందని వివరించారు. మాజీ రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు , కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ , రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా వంటి పలువురు నేతలు అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆయన నిస్వార్థ సేవలు అనితర సాధ్యం అని నేతలు ప్రశంసించారు. విలువలకు కట్టుబడి నిలిచి, నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీ లేకుండా సాగే నేతగా అద్వానీ ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు ఆదర్శంగా ఉన్నారని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ తమ సందేశంలో తెలిపారు. ఎల్‌కె అద్వానీ 1927 నవంబర్ 8వ తేదీన కరాచీలో జన్మించారు. అవిభక్త భారతదేశంలో జన్మించి తరువాత స్వాతంత్ర భారతదేశంలో రాజకీయ నేతగా విశిష్ట స్థానం పొందిన కొందరు నేతలలో అద్వానీ ఒక్కరిగా నిలిచారు. అద్వానీకి ఓ కూతురు ప్రతిభా అద్వానీ, కుమారుడు జయంత్ అద్వానీ ఉన్నారు.