Saturday, November 16, 2024

ముందు గుజరాత్‌లో బిసిని సిఎం చేయండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రి చేస్తామంటున్న ప్రధాని నరేంద్ర మోడి ముందు గుజరాత్‌లో బిసిని ముఖ్యమంత్రి చేయాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాలు చేశారు. బుధవారం ఖానాపూర్, ఆదిలాబాద్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ముగ్గురు బిసిలను ముఖ్యమంత్రులను చేసిందని, 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి ఒక్క బిసిని సిఎం చేసిందని విమర్శించారు. తెలంగాణలో బిజెపి కి 100 స్థానాల్లో డిపాజిట్లు రావని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో కోట్లు ఉన్నోళ్లకే టికెట్లు ఇస్తారని బిఆరెస్ ప్రచారం చేస్తోందని, డబ్బులు లేకపోయినా బొజ్జుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు. దళిత, గిరిజనులపై కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పార్టీకి ఉండదని రేవంత్ అన్నారు. ఇందిరమ్మ కంటే ముందు దళితులు, ఆదివాసీలకు ఎవరైనా భూములు ఇచ్చారా లేదా అనే విషయాన్ని ఆలోచించాలని సూచించారు.

కాంగ్రెస్ ఐటిడిఎ ప్రాజెక్టులు ప్రారంభించిందన్నారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ దగ్గర నోట్లు ఉంటే.. తమ అభ్యర్థుల దగ్గర ఓట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధును 2018లో ప్రవేశపెట్టారని, ధరణి పోర్టల్ ను మాత్రం 2020లో తీసుకొచ్చారని, మరి ఆ రెండేళ్లు లబ్ధిదారులకు రైతుబంధు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పేదల భూములను కంప్యూటరీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీనే కంప్యూటర్ తెచ్చిందన్నారు. ధరణి స్థానంలో మంచి పోర్టల్ తీసుకొస్తామని, ఎవరికి నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ హయంలో ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తామని, వాటిని అమ్ముకునే సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు.

తెలంగాణ వచ్చినా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నీళ్లు రాలేదని, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ నిర్మాణ ప్రదేశాన్ని మార్చి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టును దెబ్బ తీశారన్నారు. కాంగ్రెస్ కట్టిన కడెం, సదర్‌మాట్ ప్రాజెక్టులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించు కోలేదన్నారు.కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకులపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. వైఎస్ హయంలో రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే నామినేషన్ వెయ్యబోమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆదివాసీలు లంబాడీలను ఏకం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు వర్గాలు రెండు కళ్ళ లాంటి వారిని అన్నారు, వీరిద్దరి మధ్య నెలకొల్పిన విభేదాలను వెంటనే తొలగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఏమి చేసిందని బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడు తున్నారని తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్‌నని ఆయనన్నారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్లే మీరు పదవులు అనుభవిస్తున్నారని బిఆర్‌ఎస్ నేతల నుద్దేశించి అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే అడుక్కుతినే వారని చురకలు అంటించారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటే నని, నిన్న ఎల్‌బి స్టేడియంలో జరిగిన సభలో ప్రధాని మోడి కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మోడి మేడిగడ్డకు ఎందుకు పోలేదని ప్రశ్నించారు. మోడి లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతాడు కాని, కాళేశ్వరంగురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బిజెపికి ఓటేస్తే.. బిఆర్‌ఎస్ కు ఓటేసినట్టేనని విమర్శించారు.రాజేంద్ర నగర్ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా ఇక్కడి భూములను ప్రభుత్వం అమ్ముకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించేందుకు ప్రభుత్వానికి భూమి దొరకడంలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కోకాపేటలో దళితులకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం గుంజుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ విధానాల వల్లే హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు.

పేదలు ఇండ్లు కట్టుకుంటే 111 బిఓ అని చెప్పి కూలగొడతారు కాని బిఆరెస్ నేతలు ఫామ్ హౌస్ లు కట్టుకుంటే ఒక్క అధికారి వెళ్లడని విమర్శించారు. అధికారంలోకి వచ్చే వెంటనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ది చేయించే బాధ్యత తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని, ఆ బాధ్యత కూడా తనదేనన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చోట మేం ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగండి. ఈ సవాల్ కు బిఆరెస్ సిద్ధమా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీలో ఆశావహులు ఎందరు ఉన్నా ఒక్కరికే టికెట్ ఇవ్వగలమని, టికెట్ రాని వారిని కాంగ్రెస్ కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. టికెట్ రాని నేతలెవరు బాధపడొద్దని…ప్రభుత్వం రాగానే సముచిత న్యాయం చేస్తామని హామినిచ్చారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News