Saturday, November 23, 2024

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్, సిరాజ్‌లకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లు టాప్ ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు. సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో గిల్ బ్యాటింగ్‌లో, సిరాజ్ బౌలింగ్‌లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్, సిరాజ్‌లు పాకిస్థాన్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, షాహిన్ అఫ్రిదిలను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లారు. తాజాగా ర్యాంగింల్స్‌లో గిల్ 830 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. గిల్ కెరీర్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. వరల్డ్‌కప్‌లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో గిల్‌కు టాప్ ర్యాంక్ సొంతమైంది.

ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 824 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక వరల్డ్‌కప్‌లో పరుగుల వరద పారిస్తున్న సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 771 పాయింట్లతో మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. భారత స్టార్ విరాట్ కోహ్లి 770 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) ఐదో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. వండర్ డుసెన్ (సౌతాఫ్రికా), హారి టెక్టర్ (ఐర్లాండ్), హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా), డేవిడ్ మలన్ (ఇంగ్లండ్)లు టాప్10లో చోటు కాపాడుకున్నారు.

సిరాజ్ హవా..
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత సంచలనం, హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ప్రపంచకప్‌లో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ తాజా ర్యాంకింగ్స్‌లో 709 పాయింట్లతో మొదటి ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 694 పాయింట్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సిరాజ్‌తో పాటు కేశవ్ మహారాజ్ వరల్డ్‌కప్‌లో నిలకడైన బౌలింగ్‌ను కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా మూడో, భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగో, పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News