Saturday, December 21, 2024

పాలస్తీనా తిరుగుబాటుకు కారణాలు

- Advertisement -
- Advertisement -

49 ఏళ్ల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ దౌత్య ఓటమి చెందాయి. పాలస్తీనా, ఐక్యరాజ్య సమితి గెలిచాయి. 13 నవంబర్ 1974 న పాలస్తీనా విమోచన సంస్థ (పిఎల్‌ఒ) అధ్యక్షుడు యాసర్ అరాఫత్ ఐరాస సర్వసభ్య సభలో నాటకీయంగా ప్రవేశించారు. శాంతి కావాలో, స్వాతంత్య్ర యోధుని తుపాకి కావాలో నిర్ణయించమని విశ్వసమూహాన్ని సవాలు చేశారు. క్రైస్తవులు, యూదులు, ముస్లిం లు ప్రగతి, సౌభ్రాతృత్వం, న్యాయం, సమానతలతో కలిసి జీవించ గల ప్రజాస్వామ్య దేశం కోసం పిఎల్‌ఒ కలలు కంటోంది, ఆశిస్తోంది. తన స్వీయ సంకల్ప సాధన పోరాటంలో పాలస్తీనియన్లకు అండగా నిలవమని సర్వసభ్య సభకు విజ్ఞప్తి చేస్తోంది. (శాంతి సంకేత) ఆలివ్ కొమ్మను ఒక చేత్తో, స్వాతంత్య్ర యోధుని తుపాకిని మరొక చేత్తో పట్టుకొని వచ్చాను. నా చేతి నుండి ఆలివ్ కొమ్మను పడనివ్వకండి అని విన్నవించారు. ఐరాస సమావేశ మందిరాల్లో తమ నాయకుని ఉనికి పాలస్తీనియన్లకు ఆనందాన్ని కలిగించింది. ఏళ్ల తరబడి పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశ గుర్తింపును నిరాకరించిన అమెరికా, ఇజ్రాయెల్‌లు ఐరాసలో అరాఫత్ రాకను వ్యతిరేకించాయి.

పాలస్తీనియన్లను ప్రజలుగా కాక శరణార్థులుగానో, తీవ్రవాదులుగానో గుర్తించాలన్నాయి. భద్రతా మండలి 22 నవంబర్ 1967లో ఆమోదించిన 242 వ తీర్మానం శాంతి సాధన కోసం, యుద్ధంలో తాను ఆక్రమించిన ప్రాంతాలను వదలమని ఇజ్రాయెల్‌ను కోరింది. కాని పాలస్తీనియన్లను శరణార్థులుగానే ప్రస్తావించింది. 1968లో ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మీర్ పాలస్తీనియన్లే లేరన్నారు. అయితే 1968 నుండి పోరాట హక్కు, స్వీయ నిర్ణయాధికారాలతో సహా పాలస్తీనియన్ల విడదీయరాని హక్కులను గుర్తిస్తూ ఐరాస అనేక తీర్మాలను చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు వాటికి వ్యతిరేకంగా ఓటేశాయి. అరబ్, -ఇజ్రాయెల్ శాంతి చర్చల్లో పాలస్తీనియన్ అరబ్బుల న్యాయమైన కోర్కెలను తీర్చాలి.
1948లో ఇజ్రాయెల్ ఏర్పడగానే 7.5 లక్షల పాలస్తీనియన్లు పాలస్తీనాను విడిచి పారిపోయారు. పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశ కల్పన ఉద్దేశంతో 1964లో ఈజిప్టు రాజధాని కైరోలో అరబ్ లీగ్ శిఖరాగ్ర సమావేశంలో పిఎల్‌ఒ స్థాపించబడింది. తర్వాత ఇజ్రాయెల్‌కు ఉత్తరాన ఉన్న మధ్య ఆసియా దేశం లెబనాన్ కేంద్రంగా పిఎల్‌ఒ పని చేసింది.

1969 నుండి 2004లో మరణించే వరకు సైనిక నాయకుడు యాసర్ అరాఫత్ పిఎల్‌ఒ అధ్యక్షునిగా పని చేశారు. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడులకు పరిమితమవుతామని 1974లో అరాఫత్ ప్రకటించారు. అప్పుడు అరబ్ దేశాలు పిఎల్‌ఒను పాలస్తీనియన్ల ఏకైక చట్టబద్ధ ప్రతినిధిగా గుర్తించాయి. 1976లో అరబ్ లీగ్‌లో కలుపుకున్నాయి. 1974లో అరబ్ దేశాలు పిఎల్‌ఒను గుర్తించినా అమెరికా గుర్తించలేదు. అరబ్బులకు, యూదులకు వారివారి భూమిపై ఒకే రకమైన ప్రాథమిక హక్కులున్నాయని 1988లో పోప్ అరాఫత్‌ను వాటికన్‌లో స్వాగతించారు. 1989 మొదటి వారంలోనే 70 దేశాలు ‘కొత్త’ పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. నార్వే రాజధాని ఓస్లోలో అరాఫత్, ఇజ్రాయెల్ ప్రధాని యిట్ఝక్ రాబిన్‌ల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. ఈ శాంతి కృషికి వీరిద్దరికీ కలిపి 1994 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ ఒప్పందాలలో పాలస్తీనా నేషనల్ అథారిటి ఏర్పాటయింది. 13 సెప్టెంబర్ 1993న ఇజ్రాయెల్ గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలపై పాలస్తీనియన్లకు సర్వాధికారాన్ని ఇచ్చింది. తర్వాత అమెరికా పిఎల్‌ఒను గుర్తించింది. 1996లో జరిగిన ఎన్నికల్లో అరాఫత్ పాలస్తీనా అథారిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ప్రజాస్వామ్యం లోపభూయిష్టంగా ఉందని విమర్శలు ఉన్నాయి.

2006లో పాలస్తీనా శాసన మండలి ఎన్నికల్లో ముస్లిం సున్నీ సమరశీల బృందం హమాస్, పిఎల్‌ఒ బహుళ పక్ష బృందం ఫతాపై ఆధిక్యత సాధించింది. ఈ రెండు సంస్థల మధ్య 2007 లో హింసాయుత ఘర్షణ జరిగింది. గాజా యుద్ధంలో హమాస్ ఫతాను ఓడించింది. ఫలితంగా వెస్ట్ బ్యాంక్‌లో ఫతా పాలన కొనసాగింది. గాజా హమాస్ పాలన కిందికి వచ్చింది. 2014లో హమాస్, ఫతాలు కలిసి ఏకీకృత జాతీయ పాలస్తీనియన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఐరాస సర్వసభ్య సభ 2012లో పాలస్తీనాను సభ్యత్వం లేని పరిశీలన దేశంగా ఓటేసింది. ఫలితంగా పాలస్తీనాకు ఐరాస సర్వసభ్య సభలో చర్చల్లో పాల్గొనే అవకాశం లభించింది. పిఎల్‌ఒకు 2015లో అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో సభ్యత్వం ఇచ్చారు. ప్రస్తుతం మహ్మద్ అబ్బాస్ పిఎల్‌ఒ, పాలస్తీనా అథారిటీలకు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.ఈయన సాపేక్షికంగా హద్దులకు లోబడి పని చేసే నాయకుడుగా పేరుపొందారు. అంతర్జాతీయంగా పాలస్తీనాకు ప్రత్యేక దేశం హోదా గుర్తింపు కోసం పిఎల్‌ఒ కృషి చేస్తోంది. ఇజ్రాయెల్-, పాలస్తీనా రెండు దేశాల కొనసాగింపు పాలస్తీనా సమస్యకు సరయిన పరిష్కారం. కాని ఇది అమెరికా, ఇజ్రాయెల్ లకు ఇష్టం లేదు. 2017 లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తటస్థ దేశం జెరుసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించారు. ఇది అరబ్బులు, వారి మిత్ర దేశాలకు ఆగ్రహం తెప్పించింది.

తీవ్రవాదికి, విప్లవకారునికి తేడా ఉంది. వారి పోరాట లక్ష్యాలు వేరు. తమ పంతాన్ని నెగ్గించుకోడానికి, తమ భావాలను రుద్దడానికి, హింసావాదం, ఉద్రేకాలతో ఇతరులను భయపెట్టి ఆక్రమణలతో, వలసవాదంతో, అణచివేత, యుద్ధచర్యలతో మానసిక ప్రతిచర్యలకు పాల్పడేవారు, సమాజ వ్యతిరేక మార్గాలను ఎంచుకునేవారు తీవ్రవాదులు. వారి పంతం, భావాలు సరైనవి కావచ్చు, కాకపోవచ్చు. న్యాయమైన లక్ష్యాల కోసం నిలబడి, ఆక్రమణదారులు, వలసవాదుల నుండి స్వేచ్ఛ, విముక్తుల కోసం పోరాడేవారు విప్లవకారులు. వీరి గమన గమ్యాలు, కార్యక్రమాలు బలహీనుల పక్షాన న్యాయం, సమానత్వాల కోసం ఉద్దేశించబడి ఉంటాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాలను ఆక్రమించింది. వారి హక్కులను హరించింది. హింసకు, హత్యలకు పాల్పడింది. మాటలతో, చేతలతో అడుగడుగునా భయాలకు గురి చేసింది. ఇజ్రాయెల్ దుశ్చర్యలకు అమెరికా,

ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి సామ్రాజ్యవాద దేశాలు వత్తాసు పలికాయి, సహకరించాయి. ఐరాస వ్యవస్థాపక ఒప్పందం 12 వ అధ్యాయం ప్రకారం అంతర్జాతీయ శాంతి భద్రతల రక్షణ, ఉల్లంఘన, ఆక్రమణ, యుద్ధ నివారణకు భద్రతా మండలి సైనిక, నిస్సైనిక చర్యలు తీసుకోవచ్చు. అయినా అంతర్జాతీయ సంస్థలు మౌనం వహించాయి. ఈ వేదికలపై పాలస్తీనియన్లకు నమ్మకం పోయింది. కేవలం రాజకీయ ప్రక్రియలతో ఇజ్రాయెల్ ఆక్రమించిన పాలస్తీనా భూమిలో ఒక్క ఇంచును కూడా తిరిగి పొందలేమన్న నిర్ధారణకు వచ్చారు. గత్యంతరం లేక సాయుధ పోరాటానికి దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News