జమ్మికుంట రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు
ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మూడవసారి అధికారం బిఆర్‌ఎస్‌దే
మన తెలంగాణ/ జమ్మికుంట : ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మళ్లీ బిఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, సిఎం కెసిఆరే ముచ్చటగా మూడోసారి సిఎం అవుతారని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్ రావు అన్నారు. రైతులకు ఎలాంటి మాట ఇవ్వకపోయిన రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం అమలు చేస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీచౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఈసారి అధికారంలోకి వచ్చాక రూ. 5 వేలు పెన్షన్ పథకం కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. కెసిఆర్ మాట ఇవ్వకపోయిన రైతుబంధు పథకం అమలు చేసినట్లే, తప్పకుండా సౌభాగ్యలక్ష్మీ పథకాన్ని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.
ప్రతి పక్ష పార్టీలు చెప్పే మాటలు ఏమాత్రం నమ్మాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణకు ఏం చేయాలో చెప్పి ఓట్లు అడగాలన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు ఏనాడూ పట్టించుకోని బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు రావటంతో వారి మోహలు ఇప్పుడు అగపడుతున్నాయని కష్టసమయాల్లో ఏమయ్యారని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు సిఎం కెసిఆర్ నిరంతరం కృషి చేస్తూ రాష్టాన్ని అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంచారన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓట్లేస్తే మళ్లీ కష్టాలు కొనితెచ్చుకోవటమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన పాడి కౌశిక్‌రెడ్డినే భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్‌ను నియోజకవర్గం ప్రజలు నమ్మి ఓటేస్తే ఆయన నియోజకవర్గం ప్రజలను మరిచిపోయారన్నారు. ఇక్కడి ప్రజలకు ఈటల రాజేందర్ పరిస్థితి అర్థం కావడంతో నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోయారని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులతో ఈటల రాజేందర్ ములాఖత్ అయ్యరని, ఆయన ఆత్మగౌరవం, తెలంగాణ పౌరుషం ఎక్కడకు పోయాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ప్రజలకు కాంగ్రెస్, బిజెపి పార్టీల మోసాలు ఎప్పుడో అర్థం అయ్యాయని అన్నారు. ప్రజలు కాంగ్రెస్, బిజెపి పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన పాడి కౌశిక్‌రెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరావు, ఎంపిపి దొడ్డె మమత ప్రసాద్, వైస్ చైర్‌పర్సన్ దేశిని కోటి, వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.