అభ్యర్థి నామినేషన్‌తో పాటు అఫిడవిట్ తప్పనిసరి!
అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే శిక్ష పడినట్టే..
ఎన్నికల నియమావళి 1961కి లోబడి ‘రూల్-4ఏ’ కింద నిర్దేశించిన ఫాం-26లో అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాల్సిందే..
మనతెలంగాణ/హైదరాబాద్: అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల బాధ్యత, హక్కు, విధి. అప్పుడే అభ్యర్థులకు సంబంధించి ఓ స్పష్టత వస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టంచేసింది. అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌తో పాటు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 1961 ఎన్నికల నిబంధన ఎన్నికల నియమావళి 1961కి లోబడి ’రూల్-4ఏ’ కింద నిర్దేశించిన ఫాం-26 రూపంలో అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు కుటుంబసభ్యులకు చెందిన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. భర్త లేదా భార్య, వారిపై ఆధారపడిన కుటుంబంలోని సభ్యులు, అవిభాజ్య హిందూ కుటుంబంలో కర్త అయితే అందుకు సంబంధించిన వివరాలను కచ్చితంగా పేర్కొనాలి.
అన్ని రకాల ఆస్తులు, స్థిర, చర ఆస్తుల వివరాలతో పాటు చేతిలో, బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు, డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర సేవింగ్స్, షేర్లు, బాండ్లు, బీమా, ఇతరులకు ఇచ్చిన అప్పులు, తదితర అన్ని వివరాలు పొందుపర్చాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాలు ఇలా అన్ని రకాల ఆస్తుల వివరాలు అఫిడవిట్లో తప్పనిసరిగా పేర్కొనాలి. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు, నివాస భవనాలకు సంబంధించిన వివరాలను అందులో పొందుపర్చాలి. అవి వారసత్వంగా వచ్చాయా లేక కొనుగోలు చేశారా అన్నది తెలపాలి. స్థిరాస్థులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువను పొందుపర్చాలి.
రుణాలను, ఆదాయం వివరాలను పొందుపరచాలి
అభ్యర్థితో పాటు కుటుంబసభ్యుల పేరిట రుణాలు ఉంటే వాటి వివరాలు సైతం అఫిడవిట్లో ప్రస్తావించాలి. 2019లో సవరించిన నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను రిటర్న్‌లో పొందుపర్చిన ఆదాయ వివరాలతో పాటు గడిచిన ఐదేళ్ల రిటర్న్ ఆదాయ వివరాలను పేర్కొనాలి. విదేశాల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నాయి..? వాటి నుంచి లబ్ధిపొందుతున్న వివరాలు అఫిడవిట్లో పొందుపర్చాలి. అభ్యర్థితో పాటు భార్య లేదా భర్త వృత్తి, వారికి వచ్చే ఆదాయ మార్గాలు, ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నివాసాలు ఉపయోగిస్తే వాటికి సంబంధించిన వివరాలు, నో- డ్యూస్ ధ్రువపత్రాలు జతపర్చాలి. వీటితో పాటు అభ్యర్థుల నేరచరిత్రకు సంబంధించిన వివరాలు అఫిడవిట్లో తప్పనిసరిగా పొందుపర్చాలి.
అభ్యర్థి క్రిమినల్ వివరాలు అఫిడవిట్లో దాఖలు చేయడంతో పాటు వారిపై నమోదైన క్రిమినల్ కేసులు, వాటి వివరాలను పేర్కొనాలి. ఒకవేళ ఏదైనా కేసులో న్యాయస్థానాలు గతంలో శిక్ష విధించినా, వాటిపై అప్పీల్‌కు వెళ్లినా వాటి వివరాలతో పాటు ప్రస్తుత స్థితిని అఫిడవిట్లో తెలపాల్సి ఉంటుంది. అన్నింటితో పాటు అభ్యర్థుల సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను పొందుపర్చాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్‌ను నోటరీ చేయించాల్సి ఉంటుంది. సాధారణంగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేస్తారు. ఒకవేళ అభ్యర్థి తరపున వేరే ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే సదరు అభ్యర్థి తాను ఉన్న ప్రాంతంలోని మెజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారైతే అక్కడి భారత ఎంబిసి నిర్ధేశించిన వారి వద్ద ప్రమాణం చేయాలి.
అఫిడవిట్లో ఏ ఒక్క కాలమ్‌ను ఖాళీగా వదల కూడదు
అఫిడవిట్లో ఏ ఒక్కకాలమ్ ఖాళీగా వదలకూడదు. అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన అనంతరం అందులో ఏదైనా సమాచారం లేకపోతే రిటర్నింగ్ అధికారి సదరు అభ్యర్థికి నోటీసు ఇస్తారు. అభ్యర్థి పూర్తి వివరాలతో కూడిన రివైజ్డ్ అఫిడవిట్‌ను సమర్పించాలి. పూర్తిస్థాయి వివరాలతో అఫిడవిట్ లేకపోతే నామినేషన్‌ను స్క్రూటీని వేళ తిరస్కరిస్తారు. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రతులను రిటర్నింగ్ అధికారులు నోటీసు బోర్డుపై ఉంచుతారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టప్రకారం శిక్ష పడినట్టే. దాంతోపాటు 24 గంటల్లోపు వాటిని వెబ్సైట్లో పొందుపరుస్తారు.
అభ్యర్థి తన రివైజ్డ్ అఫిడవిటుట్ను సమర్పిస్తే దానిని కూడా పొందుపరుస్తారు. ఒకవేళ అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నా వెబ్సైట్లో ఉంచినా అఫిడవిట్ మాత్రం అలాగే ఉంటుంది. అఫిడవిట్లో పొందుపర్చే అన్ని వివరాలకు సదరు అభ్యర్థి పూర్తిబాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే చట్టప రంగా చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వచ్చిన పిటిషన్ల ఆధారంగా ఇటీవల న్యాయస్థానాలు కొందరిపై అనర్హత వేటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.