Tuesday, December 24, 2024

చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

- Advertisement -
- Advertisement -

సినీనటుడు చంద్రమోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందూతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, ఎపి సిఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోషన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “పౌరానిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యానటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారు. చంద్రమోహన్ తో పాటు పలు చిత్రాల్లో నటించా. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు. చంద్రమోహన్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా” అని అన్నారు.

చంద్రమోషన్ మృతిపై ఎక్స్ లో చిరంజీవి స్పందిస్తూ..” ‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక  ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను” అని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

“ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నా” అని చంద్రమోషన్ మృతిపై ఎక్స్ లో ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.

జనసేన అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చంద్ర మోహన్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..”చంద్రమోహన్ గారు కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందాను. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేది. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనను చూపించారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. చంద్ర మోహన్‌తో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికి చంద్రమోహన్ చేరువయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా” అని చెప్పారు.

ఎపి సిఎం జగన్ కూడా చంద్రమోహన్ పై తీవ్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “చంద్రమోహ‌న్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూయ‌డం బాధాక‌రం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న.. తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహ‌న్ కుటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా, ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని అన్నారు.

కాగా, 1943 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1966లో రంగుల రాట్నం సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. ఆయన కెరీర్ తొలి నాళ్లలో హీరోగా చాలా సినిమాల్లో నటించి అలరించారు. శ్రీదేవీ, జయప్రద, జయసుధ, సుహాసినీ, విజయశాంతి లాంటి హీరోయిన్లతో చంద్రమోహన్ హీరోగా నటించారు. పలు తమిళ సినిమాల్లోనూ ఆయన నటించారు.

తర్వాత హాస్యనటుడు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆయన తన సినీ ప్రయాణంలో మొత్తం 932 సినిమాలు చేశారు. పదహారేళ్ల వయసు, సిరిసిరి మువ్వ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్లులు అందుకున్నారు. 1987లో చందమామ రావే అనే సినిమాకు ఉత్తమ కమెడీయన్ గా చంద్రమోషన్ నంది అవార్డు అందుకున్నారు. తన సినీ కెరీర్ లో రెండు ఫిలింఫేర్, 6 నంది అవార్డులను అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ లో చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News