Sunday, January 19, 2025

ములుగులో త్రిముఖ పోరు

- Advertisement -
- Advertisement -

ములుగు : ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బిజెపి మాత్రం తమ అభ్యర్థిని ఈనెల 7న ప్రకటించడంతో ఎట్టకేలకు ప్రచారం మొదలు పెట్టారు. కాగా మూడు ప్రధాన పార్టీల మధ్య ములుగు నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఉండబోతుంది. బిఆర్‌ఎస్ అభ్యర్ధి బడే నాగజ్యోతి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి ప్రచారంలో దూసుకుపోతుండగా అంతే దీటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ప్రచారంలో తనదైన ముద్ర వేస్తూ దూకుడు పెంచింది. బిజెపి అభ్యర్థ్ధి డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ మాత్రం ములుగు నియోజకవర్గంలో తన తండ్రి మాజీ మంత్రి దివంగత అజ్మీరా చందూలాల్ చేసిన పలు అభివృద్ధి పనులను ప్రజలకు వివస్తూ ప్రచారంలో దూసుకుపోనున్నారు. ప్రహ్లాద్‌కు గతంలో తండ్రి హయాంలో 2016లో మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చేసిన అనుభవం ఉంది.

కాంగ్రెస్‌కు ఓటేస్తే 60 ఏళ్లు వెనక్కి అంటున్న బడే నాగజ్యోతి
ప్రజా ఉద్యమంలో అసువులు బాసిన బడే ప్రభాకర్న దంపతుల బిడ్డ నాగజ్యోతికి సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపే లక్షంగా తన ప్రత్యర్థ్ధులైన కాంగ్రెస్ పార్టీ సీతక్క, బిజెపి పార్టీ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్‌లను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బిజెపిపై ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమి లేదని, ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ప్రచారంలో వివరిస్తూ ముందుకు సాగుతోంది.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఎండగడుతున్న సీతక్క
గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని ఎమ్మెల్యే సీతక్క బిఆర్‌ఎస్‌ను ఎండగడుతున్నారు. 2018 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్ధి మాజీ మంత్రి దివంగత చందూలాల్‌పై పోటీచేసి గెలిచిన దనసరి అనసూయ అలియాస్ సీతక్క కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మన్ననలు పొందింది. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి అభ్యర్ధులకు ధీటుగా ప్రచారంలో పాల్గొంటుంది. ప్రజాక్షేత్రంలో ఉంటూ విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వైపల్యాలను ఎండగడుతోంది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళుతోంది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను వివరిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరవేస్తానంటూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తుంది.

భారతీయ జనతాపార్టీ గెలుపే లక్షంగా ప్రహ్లాద్ ప్రచారం
ములుగు నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ గెలుపే లక్షంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సీతక్క గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమి లేదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులతో పథకాలు అమలు చేస్తూ మేమే అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఉద్యోగాల కల్పనలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్, ఒక్క అవకాశం ఇస్తే తన తండ్రి మాదిరిగానే అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. ములుగు నియోజకవర్గంలో త్రిముఖపోటీతో ఎవరికి ఓటు వేయాలా అని ప్రజలు సందిగ్ధంలో పడ్డారు. నియోజకవర్గంలో గెలుపుపై ఎవరిధీమాలో వారు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజలు ఎవరివైపు ఉన్నారో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News