Friday, January 3, 2025

కీవ్‌పై రష్యా క్షిపణి దాడి

- Advertisement -
- Advertisement -

కీవ్: రష్యా దళాలు శుక్రవారం రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్షంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఉక్రెయిన్ వ్యాప్తంగా జరిపిన దాడుల్లో భాగంగా ఈ దాడులు జరిగాయి. మరో వైపు ఉక్రెయిన్ డ్రోన్లు మాస్కో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా స్మోలెన్‌స్క్ ప్రాంతాలను లక్షంగా చేసుకుని దాడులు జరిపినట్లు రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా దూసుకువస్తున్న ఒక బాలిస్టిక్ క్షిపణిని కూల్చి వేసినట్లు కీవ్ సిటీ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెర్హిల్ పోప్కో చెప్పారు. ఈ దాడిలో రష్యా ఇస్కందర్‌ఎం క్షిపణిని ఉపయోగించినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ఆ తర్వాత ధ్రువీకరించింది. దాదాపు రెండు నెలల తర్వాత కీవ్‌పై రష్యా క్షిపణి దాడి జరపడం ఇదే మొదటి సారి. ఒడెసా, ఖార్కీవ్, సుమీ, కిరోవోహ్రాడ్ తదితర ప్రాంతాలపై రష్యా జరిపిన డ్రోన్ దాడులను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు విజయవంతంగా తిప్పికొట్టాయని ఆయన చెప్పారు.

రష్యా బలగాలు 31 షహెద్136/131 రకం డ్రోన్లను ప్రయోగించాయని, వీటిలో 19 డ్రోన్లను కూల్చేశామని ఆయన చెప్పారు. కాగా స్మోలెన్‌స్క్, మాస్కో ప్రాంతాలపై రెండు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణ శాఖ కూడా ప్రకటించింది. ఇదిలా ఉండగా రష్యాలోని రియాజన్ ప్రాంతానికి సరకులను తీసుకు వెళ్తున్న రైళ్లు శనివారం ఉదయం అనధికారిక జోక్యం కారణంగా పట్టాలు తప్పినట్లు మాస్కో రైల్ ఆపరేటర్ ‘ఎంజడ్‌హెచ్‌డి’ పేర్కొంది. 15 బోగీలు పట్టాలు తప్పినట్లు ఆ సంస్థ తెలిపింది. శనివారం ఉదయం ఆ ప్రాంతం సమీపంలో ఒక పేలుడు శబ్దం కూడా వినిపించినట్లు రష్యా మీడియా సంస్థలు తెలిపాయి. అయితే ఈ వార్తలు ధ్రువీకరణ కాలేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటినుంచి రష్యా ప్రాంతంలోని రైల్వే వ్యవస్థపై పలు దాడులు జరిగాయి. ఈ దాడులకు ఉక్రెయినే కారణమని రష్యా ఆరోపిస్తోంది కూడా. కాగా శనివారం జరిగిన దాడిపై ఉక్రెయిన్ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News