రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లో ఎన్నికల సిబ్బందితో పాటుగా ఓటింగ్ యంత్రాలను తరలించడానికి భారత వైమానిక దళం ఎనిమిది ఎంఐ17 హెలికాప్టర్లతో 404 ట్రిప్పులు నిర్వహించాల్సి వచ్చిందని ఎన్నికల ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం చెప్పారు. చత్తీస్‌గఢ్‌లో ఈ నెల 7న తొలి విడత ఎన్నికలు జరిగిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్తర్‌ప్రాంతంలోనే 12 నియోజకవర్గాలు ఉన్నాయి.ఈ 20 నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో 78 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ‘అన్ని సవాళ్లను ఎదుర్కొని భారత వైమానిక దళం ఎనిమిది ఎంఐ17 హెలికాప్టర్లతో 404 ట్రిప్పులు నిర్వహించి 853 మంది పోలింగ్ సిబ్బందిని 43 ప్రాంతాలకు తీసుకెళ్లి తిరిగి క్షేమంగా తీసుకు వచ్చి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా జరిగేలా చూసింది.
సెల్యూట్ టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్’అని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శుక్రవారం ఎక్స్‌లో చేసిన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా నవంబర్ 7న జరిగిన పోలింగ్ కోసం నవంబర్ 4నుంచి 6వ తేదీ వరకు హెలికాప్టర్లద్వారా బస్తర్ డివిజన్‌లోని అయిదు జిల్లాలు సుక్మా, బిజాపూర్, కాంకేర్, దంతేవాడ, నారాయణ్‌పూర్‌లలోని 156 పోలింగ్ కేంద్రాలకు 860 మందికి పైగా పోలింగ్ సిబ్బందిని పంపించినట్లు రాష్ట్ర పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్ రాజ్ చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత వీళ్లందరినీ ఇవిఎంలతో పాటుగా క్షేమంగా ఆయా జిల్లాల ప్రధాన కార్యాలయాలకు దశల వారీగా తిరిగి తీసుకు రావడం జరిగిందని, నవంబర్ 9వ తేదీ సాయంత్రానికి ఈ ప్రక్రియ పూర్తయిందని ఆయన చెప్పారు. ఎన్నికలు సాఫీగా జరిగేలా చూడడానికి ఆరు రోజలు పాటు సహకరించిన భారత వైమానిక దళానికి ఐజి కృతజ్ఞతలు తెలియజేశారు.