పారిస్: ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరుతో గాజాలోని సామాన్య ప్రజల బతుకులు ఛిద్రమైపోతున్నాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం బిబిసి వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మేక్రాన్ ఈ విధంగా స్పందించారు. అయితే దీనిపై ఇజ్రాయెల్‌నుంచి ఘాటు స్పందన వచ్చింది.‘ ఈ దాడులు ఏమాత్రం సమర్థనీయం కాదు. కాల్పుల విరమణ ఇజ్రాయెల్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. ఉగ్రవాద చర్యలను ఫ్రాన్స్ ఏమాత్రం సమర్థించదు. ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది.
అదే సమయంలో ఆ దేశం గాజాలో బాంబుదాడులను ఆపాలని మేము కోరుతున్నాం’ అని మేక్రాన్ అన్నారు.కాల్పుల విరమణ కోసం అమెరికా, బ్రిటన్‌లు కూడా తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. గాజాలోని పరిస్థితులపై పారిస్‌లో మానవతా సదస్సు జరిగిన నేపథ్యంలో మేక్రాన్ నుంచి ఈ స్పందన వచ్చింది. అయితే మేక్రాన్ ఇచ్చిన పిలుపుపై ఇజ్రాయెల్ తీవ్రంగా బదులిచ్చింది.‘ ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌ను కాదు, హమాస్ చర్యలను ఖండించాలి. హమాస్ మా దగ్గర పాల్పడుతున్న నేరాలు రేపు పారిస్, న్యూయార్క్‌లోనూలేదా ప్రపంచంలో ఎక్కడైనా జరగొచ్చు’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.