లోక్‌సభలో ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించి మోడీ అదానీ అనుబంధం మూలాలను ప్రశ్నించి ప్రభుత్వాన్ని గడగడలాడించి ఫైర్ బ్రాండ్ అనిపించుకొన్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపి మహువా మొయిత్రా మెడపై పార్లమెంటు సభ్యత్వ రద్దు కత్తి సునిశితంగా వేలాడడం విస్తుపోవలసిన విషయం కాదు. తమ వారిని అక్కున చేర్చుకొని, కాని వారిని తక్కువగా చూసే పక్షపాత దృష్టి మితిమించిన భారతీయ జనతా పార్టీ హయాంలో ఇది ఎంత మాత్రం వింత కాదు. అదానీని అంతర్జాతీయ అగ్రశ్రేణి ఐశ్వర్య వంతుడిని చేయడానికి ప్రధాని మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న విమర్శ వెల్లువెత్తుతున్న సమయంలో దాని గుట్టును బట్టబయలు చేయడానికి ప్రశ్నలు సంధించిన మొయిత్రాకు ఇటువంటి గడ్డుకాలం దాపురించడాన్ని సహజమైన పరిణామంగానే పరిగణించాలి. సాటి సభ్యుడిని పార్లమెంటులోనే మతపరమైన అసభ్య పదజాలంతో దూషించిన సొంత పార్టీ ఎంపి రమేశ్ బిదూరి దుష్ప్రవర్తనను చూసీ చూడనట్టు ఊరుకొని మొయిత్రాపై ఇంతటి తీవ్రమైన చర్యకు రంగం సిద్ధం చేయడంలోని ఔచిత్యం ప్రశ్నించదగినది. బహుజన సమాజ్ పార్టీకి చెందిన ఎంపి (యుపి) డానిష్ అలీని దక్షిణ ఢిల్లీ బిజెపి ఎంపి రమేశ్ బిదూరి గత సెప్టెంబర్ 21న పార్లమెంటులోనే ముల్లా ఉగ్రవాది అని తిట్టి ఆయనను బయటికి గెంటి వేయాలని అరిచారు.
ఇంతకంటే పార్లమెంటు గౌరవానికి జరిగిన అపచారం ఏమైనా వుంటుందా? ఈ దారుణమైన ప్రవర్తనపై సంజాయిషీ ఇవ్వడానికి అక్టోబర్ 23న హాజరు కావలసిందిగా హక్కుల కమిటీ బిదూరికి నోటీసు పంపగా తాను రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో వున్నానని చెప్పి ఆయన తప్పించుకొన్నాడు. అతడిపై ఇంత వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. అదానీకి ఆరు విమానాశ్రయాలను అప్పగించడం గురించి, గంగవరం రేవు వంటివి కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తూ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు సంధించారు. అదానీ తనకు అప్పగించిన ఆరు విమానాశ్రయాల పనిని చేపట్టడంలో జాప్యం చేస్తున్నందున ప్రభుత్వ నష్టాలు పేరుకుపోతున్నాయని కూడా ఆమె పార్లమెంటు దృష్టికి తెచ్చారు. అయితే మొయిత్రా ఈ ప్రశ్నలను అదానీ గ్రూపుకి పోటీగా వున్న హీరానందానీ గ్రూపు తరపున వేశారని అందుకు లంచం తీసుకొన్నారని బిజెపి ఎంపి నిశికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. హీరానందానీ గ్రూపు సిఇఒ దర్శన్ హీరానందానీ కూడా ఇందుకు గొంతు కలిపారు. డబ్బు కోసం ఆమె తనపై ఒత్తిడి తెచ్చేవారని హీరానందానీ ఆరోపించారు. దుబాయ్‌లో వుండే దర్శన్ హీరానందానీకి ఆమె తన వెబ్‌సైట్ తాళం (లాగిన్ వివరాలు) చెవిని కూడా అప్పగించినట్టు బయటపెట్టారు.
మామూలుగా పార్లమెంటు సభ్యులు సభలో తాము అడగాలనుకొన్న ప్రశ్నను అడిగే అవకాశాన్ని వెంటనే పొందలేరు. ఆ ప్రశ్నలు ఒక వ్యవస్థీకృతమైన పద్ధతిలో వడపోతకు గురి అవుతాయి. ఆ క్రమంలో వాటిని అడిగే అవకాశం వెంట వెంటనే వారికి లభించదు. ఎప్పుడు, ఎవరి ప్రశ్నలు ఏ మేరకు అనుమతి పొందుతాయో తెలియదు. అటువంటప్పుడు మొయిత్రా అడగడానికి అవకాశాన్ని సాధించిన ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఆమెకు అందివచ్చినవే అవుతాయి. ఆమె పూర్వ సహచరుడు అని భావిస్తున్న సుప్రీం కోర్టు అడ్వొకేటు జై అనంత్ దేహాద్రి అందజేసిన సమాచారం ప్రాతిపదికగానే ఈ ఆరోపణలు చోటు చేసుకొన్నట్టు తెలుస్తున్నది. దర్శన్ హీరానందానీ డబ్బు ఇచ్చి మొయిత్రా చేత అదానీపై ప్రశ్నలు వేయించాడని దేహాద్రి సిబిఐకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఆమె డబ్బు తీసుకొన్నట్టు రుజువులు ఇంత వరకు లభించలేదు. అటువంటప్పుడు ఆమె లోక్‌సభ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ ఏ విధంగా సిఫార్సు చేసిందనేది కీలకమైన ప్రశ్న. ఒక పెంపుడు కుక్క విషయంలో మొయిత్రాకు దేహాద్రికి తీవ్ర విభేదాలు తలెత్తి వారిద్దరూ శత్రువులయ్యారని సమాచారం. దానితో మొయిత్రాపై అతడు కక్ష కట్టి ఆరోపణలు చేశారని అర్థమవుతున్నది. అలాగే దర్శన్ హీరానందానీని కూడా ఎవరైనా లొంగతీసుకొని వుండవచ్చు.
మొత్తానికి సరైనటువంటి సాక్షాధారాలు లేకుండా ఒక ఫైర్ బ్రాండ్ ఎంపి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించే కార్యక్రమం చురుకుగా సాగుతూ వుంటే దానిని ఖండించి తీరవలసిందే. ఎథిక్స్ కమిటీలో మొయిత్రాను ఒక స్త్రీగా ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేశారన్న సమాచారం మరింత బాధాకరమైనది. కమిటీ వైఖరిని తప్పుపడుతూ అందులోని ప్రతిపక్ష సభ్యులు ఐదుగురు ఆమెతో పాటు వాకౌట్ చేశారు. అధికారంలో వున్న వారు తమ రాజకీయ ప్రత్యర్థుల నోరు మూయించడానికి ఇటువంటి పన్నాగాలు పన్నుతూ వుంటే అది దేశంలో ప్రజాస్వామ్యం కొడిగట్టుతున్నదని భావించడానికి అవకాశం కలిగిస్తుంది. 2005లో డబ్బు తీసుకొని ప్రశ్నలు అడగడానికి సిద్ధపడినట్టు స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడినందుకు 11 మంది ఎంపిల లోక్‌సభ సభ్యత్వాలను రద్దు చేశారు.