హైదరాబాద్: సనత్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బూత్ లెవల్ కమిటీ సమావేశంలో ఐటి శాఖ మంత్రి కెటిఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. సనత్ నగర్ అభివృద్ధి కోసం శ్రీనివాస్ యాదవ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. తప్పకుండా ఈసారి కూడా శ్రీనివాస్ యాదవ్ ని గెలిపించాలన్నారు. కెసిఆర్ వచ్చాక పేదల వైద్యం కోసం దాదాపు 350 బస్తీ దవాఖానాలు పెట్టిన మొట్ట మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట నాలుగు కొత్త ఆసుపత్రులను నిర్మిస్తున్నది కూడా కెసిఆర్ ప్రభుత్వమేనని అన్నారు.
సనత్ నగర్ లో 1000 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామని , మరో తొమ్మిది నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కెటిఆర్ తెలిపారు. అలాగే నిమ్స్ లో 2000 పడకలతో కొత్త బ్లాక్ లు నిర్మిస్తున్నామని,అల్వాలో 1000 పడకలు, గడ్డి అన్నారంలో 1000 పడకలతో నిర్మిస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు ఉచితంగా ఇస్తున్న ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. కరోనా వల్ల రెండు సంవత్సరాలు వృధా అయ్యాయని, ప్రభుత్వానికి రెండు కోట్ల లక్షల నష్టం వచ్చిందని అన్నారు.