Thursday, December 12, 2024

యుద్ధస్థలిగా గాజా ఆసుపత్రి ప్రాంతం

- Advertisement -
- Advertisement -

యుద్ధస్థలిగా గాజా ఆసుపత్రి ప్రాంతం
పారిపోతున్న వేలాది మంది, రోగుల సంకటస్థితి
డియిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ సేనల దాడి తీవ్రతరం దశలో గాజాస్ట్రిప్‌లో హృదయవిదారక మానవీయ దారుణ పరిస్థితి నెలకొంది. భూతల దాడులు, ఉధృతస్థాయి వైమానిక బాంబుల మోతతో గాజాలోని అతి పెద్ద షిఫా ఆసుపత్రిలో రోగులు భయకంపితులు అవుతున్నారు. ఇజ్రాయెల్ సేనలు, పాలస్తీనియా హమాస్ మిలిటెంట్లు ఇప్పుడు ఆసుపత్రి గేట్ల వద్దనే హోరాహోరీగా తలపడుతూ ఉండటంతో వేలాది మంది ఈ ఆసుపత్రి నుంచి బయటకు పరుగులు తీశారు.

కాగా వందలాదిగా వృద్ధులు, విషమస్థితి రోగులు, పసికందులు ఈ ఆసుపత్రిలో చిక్కుపడాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా రాకెట్ లేదా క్షిపణి ఇతరత్రా ఏ మారణాయుధం అయినా వచ్చి తాము ఉంటున్న ఆసుపత్రిని ధ్వంసం చేస్తుందనే ప్రాణాపాయ స్థితి నెలకొన్న దశలో ఈ ఆసుపత్రి జీవులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. మరో వైపు చాలా రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడం. మందుల కొరతతో వందలాది మంది శిశువులు ఎప్పుడైనా అసువులు బాసే దుస్థితిలో ఉన్నారు. తీవ్రస్థాయి రోగాలు ఉన్న వారు మృత్యుముఖంలో నిలిచారు.

ఇప్పుడు దీనికి తోడుగా ఆసుపత్రి వద్దనే నెలకొన్న తీవ్రస్థాయి పరస్పర దాడులతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తెలిపారు. తాము ప్రజలు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఇజ్రాయెల్ అధికారికంగా తెలిపింది. సౌత్ వైపు సురక్షితంగా ఉంటుందని అక్కడికి జనం వెళ్లేందుకు వీలుందని పేర్కొన్నారు. అయితే హమాస్ మిలిటెంట్లు తమ యుద్ధ వ్యూహంలో భాగంగా వైద్య సిబ్బందిని, మరికొందరిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని విదేశీ వార్తాసంస్థలు తెలిపాయి. ఈ వాదనను గాజాలోని స్థానిక అధికారులు ఖండించారు. ఆసుపత్రిలోపలి పరిస్థితి గురించి పూర్తి స్థాయిలో ఎటువంటి సమాచారం లేకపోవడంతో అంతర్జాతీయ సహాయక సంస్థలు ఆందదోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఆసుపత్రికి చాలారోజులుగా నీరు అందడం లేదని, ఇప్పుడిది ఆసుపత్రిగా కాకుండా మరుభూమిగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిని రెండు వైరి పక్షాలు మొహరించి ఉండటంతో ఇది మరింత విస్తృత స్థాయి యుద్ధం అయ్యే సంకేతాలకు దారితీసింది. ఇప్పటికీ యుద్ధం ఆరంభమయ్యి ఆరో వారానికి చేరుకుంది. గాజాస్ట్రిప్‌లో ఎక్కడా భద్రత లేకపోవడంతో అత్యధిక సంఖ్యలో పౌరులు ఆసుపత్రి అయితే తమకు రక్షణగా ఉంటుందని అనుకుని తలదాచుకుంటున్నారు. మరో వైపు ఇక్కడ విషమ స్థితిలో పలువురు రోగులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆసుపత్రిని హమాస్ మిలిటెంట్లు తమ దాడులకు కేంద్రంగా ఎంచుకున్నారని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ప్రజలను తమ రక్షణ కవచాలుగా మలుచుకుంటూ హమాస్ ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిలో తిష్ట వేసుకుందని ఇజ్రాయెల్ ఆరోపించింది.

ఇప్పుడు ఆసుపత్రిలో దాదాపు వేయి మంది వరకూ రోగులు ఉన్నారు. వీరిలో తీవ్ర స్థాయిలో గాయపడ్డ వారు ఎందరో ఉన్నారు. వీరికి సరైన వైద్యం అందించే పరిస్థితి లేదు. చివరికి వృద్ధులు, పిల్లలకు కూడా అనస్తేషియా ఏర్పాట్లు లేకపోవడంతో నేరుగా క్రిటికల్ ఆపరేషన్లు చేయాల్సివస్తోందని గాజాలోని డైరెక్టర్ ఆఫ్‌హాస్పిటల్స్ మెహమ్మద్ జాఖౌత్ తెలిపారు. గాజా సిటీలోని అల్ క్వాద్ ఆసుపత్రిని ఆదివారం మూసివేశారు. లోపల జనరేటర్లు పనిచేయని స్థితి ఏర్పడటంతో ఇక ఏమీ చేయలేక ఆసుపత్రిని బంద్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి ఆరువేల మంది రోగులను సురక్షితంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News