Monday, December 23, 2024

వివేకా హత్య కేసులో ఆసక్తికర పరిణామం

- Advertisement -
- Advertisement -

సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్

మన తెలంగాణ/హైదరాబాద్ : వివేకా హత్య కేసులో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితుడు దస్తగిరి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. తనను కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి గతంలో సిబిఐ దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్‌లో తనను సాక్షిగా చేర్చిందని కోర్టుకు వెల్లడించారు. కాగా, దస్తగిరి పిటిషన్‌పై మిగతా నిందితులు అభ్యంతరం తెలిపారు.

దస్తగిరి పిటిషన్‌పై బుధవారం సిబిఐ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఎ4గా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం విదితమే. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ ఎంవి కృష్ణారెడ్డి గత జులైలో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ సమయంలో దర్యాప్తు సంస్థ సిబిఐకి, అప్రూవర్‌గా మారిన దస్తగిరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నోటీసులపై స్పందించిన దస్తగిరి వివేకా హత్యకేసులో తనకు న్యాయసహాయం అందించాలని కోరాడు. సుప్రీంకోర్టులో న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్థిక స్థోమత లేదని న్యాయసహాయం కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. మరో వైపు దస్తగిరి అప్రూవర్‌గా మారటాన్ని వివేకా హత్యకేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
దస్తగిరి దందా గిరి…
సిబిఐ కల్పించిన సెక్యూరిటీని అడ్డం పెట్టుకుని దస్తగిరి సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. రైల్వే కోడూరులో నాలుగు షాపుల వ్యవహారంలో గదులకు తాళాలు వేసి అరాచకం సృష్టించాడు. అధిక వడ్డీలకు ఇస్తూ.. బాధితులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఆర్థిక కారణాలతో వడ్డీ డబ్బులు చెల్లించలేని వారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి వేధించే వాడు. పులివెందులకు చెందిన గులాబీ అనే మహిళ వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఆమె కుమారుడు గూగుడువలిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఇంట్లో నిర్భంధించాడు. చిత్రహింసలు పెట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంలో అసలు విషయం వెలుగు చూసింది. దస్తగిరి చెరలోఉన్న గూగుడువలిని విడిపించి, తల్లి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేశారు.

మైనర్ బాలుడిని తీసుకురావడం, చిత్ర హింసలు పాలు చేయడం, బెదిరించడం, అధిక వడ్డీలు వసూలు చేస్తూ చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడుతున్న దస్తగిరి దంపతులపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. బెయిల్ షరతులేవీ తనకు వర్తించవన్న రీతిలో యథే చ్ఛగా దౌర్జన్యాలకు దిగుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే తొండూరు పోలీస్టేషన్‌లోనే మల్లెల గ్రామానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. ఇదే మండలంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలు దొంగిలించారన్న అభియోగాలపై దస్తగిరిపై కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నడిబొడ్డున సోమవారం పట్టపగలు మూడు షాపులకు తాళాలు వేసిన దస్తగిరి వాటిని ఖాదర్‌వలీ అనే వ్యక్తికి అప్పగించాలంటూ బెదిరింపులకు దిగాడు. వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల కేంద్రంగా ఫైనాన్స్ వాహనాల సీజ్, వ్యక్తుల మధ్య ఉన్న విభేదాల్లో తలదూరుస్తూ దస్తగిరి సెటిల్‌మెంట్లకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News