Tuesday, November 5, 2024

సిఎం పదవే కాదు, బిసి డిమాండ్లు పరిష్కరించండి

- Advertisement -
- Advertisement -

బిజెపి ప్రభుత్వానికి బిసి సంఘాల డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్ : బిసి బిల్లు లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి పోరాటాన్ని ఉధృతం చేస్తామని జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రకటించింది. బిసిల ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేబానికి ఉద్యమాన్ని బలోపేతం చేయనున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్. కృష్ణయ్య తెలిపారు. మంగళవారం జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపులో అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు అన్యాయం చేశాయని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి పదవిని బిసిలకు ఇస్తామని బిజెపి ప్రకటించిందని, ముఖ్యమంత్రి పదవేకాదు బిసి డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిసి రిజర్వషన్ బిల్లు ప్రవేశ పెట్టి బిజెపి ప్రభుత్వం బిసిలపై తమ చిత్తశుద్దిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బిసి వాదం బలంగా ఉందని గుర్తించిన బిజెపి బిసి సిఎం ప్రకటించిందని ఆయనన్నారు. అంగబలం – అర్ధ బలం ఉన్న సమర్థులైన బిసి నాయకులు చాలా నియోజకవర్గాలలో ఉన్నప్పటికీ వారికి టికెట్లు కేటాయించకుండా అన్ని పార్టీలు అన్యాయం చేశాయని విమర్శించారు.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బిసిలకు కేటాయిస్తామని ఊరించి కాంగ్రెస్ పార్టీ ఆశాభంగం కలిగించిందన్నారు. బిజెపి పార్టీ బిసిలకు ముఖ్యమంత్రి పదవి ప్రకటించడంతోనే సరిపెట్టరాదని, ముఖ్యమంత్రి పదవి బిసి ఉద్యమంలో ఒక భాగం మాత్రమేనని ఆయనన్నారు. పార్లమెంటులో బిసి బిల్లు పెడితే చట్టసభలలో బిసిలకు 50 శాతం అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు బిసిలకు రిజర్వు అవుతాయని కృష్ణయ్య తెలిపారు. బిసి బిలు కోసం బిసి సంక్షేమ సంఘం గత 35 సంవత్సరాలుగా కొన్ని వేల ఉద్యమాలు, – బహిరంగ సభలు నిర్వహించిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News