ఎల్లారెడ్డి: బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమని, ఓటు వేసేముందు అభ్యర్థులు, వారి పార్టీల చరిత్ర చూడాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. ప్రజల తమ చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని సరిగా ఉపయోగించుకోవాలన్నారు. ఈ పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గమనించాలని ఆయన సూచించారు. పదేళ్ల క్రితం రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, కరెంట్ లేదని ఆరోపించారు. బిహార్ లో ఉన్న ఆర్థిక వేత్తను తీసుకువచ్చి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశానని చెప్పారు.
2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ 18వ ర్యాంకులో ఉండేది, ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ గా ఎదిగిందని సూచించారు. ఈ పదేళ్లలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో సాగునీటికి కొరత తీర్చేందుకే ఇక్కడ పోటీ చేస్తున్నానని వెల్లడించారు. కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి కూడా నా నియోజకవర్గంగా భావిస్తానని చెప్పుకొచ్చారు.