చెన్నై : స్వాతంత్య్ర యోధులు, కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం , సిపిఎం సీనియర్ నేత ఎన్ శంకరయ్య బుధవారం కన్ను మూశారు. ఆయన వయస్సు 101 సంవత్సరాలు. సిపిఎం వ్యవస్థాపక సభ్యులు అయిన కామ్రేడ్ శంకరయ్య ఇక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. శతవసంతాలు దాటిన శంకరయ్య సుదీర్ఘ జీవితకాల అలుపెరుగని యోధులు అని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తమ సంతాప ప్రకటనలో తెలిపారు.
వీరిది త్యాగమయ జీవిత అధ్యాయం అన్నారు. 1921 జులై 15వ తేదీన ఆయన జన్మించారు. ఓ వైపు దేశ స్వాతంత్య్రం , మరో వైపు దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రాణప్రతిష్టతో ఆయన జీవితం పెనవేసుకుపోయింది. ఆయన రాజకీయ జీవితం ఏడు దశాబ్దాల పాటు సాగింది. పలు సార్లు ప్రజా ప్రతినిధిగా చట్టసభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. సిపిఎంలో అనేక కీలక పదవులు నిర్వర్తించారు. తమిళనాడు సిఎం స్టాలిన్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి దివంగత నేత శంకరయ్యకు నివాళులు అర్పించారు.