Monday, December 23, 2024

2nd Semi Final: జోరుమీదున్న ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా
నేడు కోల్‌కతాలో రెండో సెమీ ఫైనల్
కోల్‌కతా: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా తలపడనుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు సెమీ ఫైనల్ మ్యాచుల్లోనూ సఫారీ టీమ్‌కు చుక్కెదురైంది. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా ఆస్ట్రేలియాను ఓడించి తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా అసాధారణ ఆటతో అలరిస్తోంది. 9 మ్యాచుల్లో కేవలం రెండింటిలో మాత్రమే ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా కూడా చివరి ఏడు మ్యాచుల్లో గెలిచి సత్తా చాటింది. తొలి రెండు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరుసగా ఏడు మ్యాచుల్లో గెలిని సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో జరుగనున్న నాకౌట్ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్మిత్,లబుషేన్, జోష్ ఇంగ్లిస్, స్టోయినిస్‌లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో మార్ష్ 132 బంతుల్లోనే అజేయంగా 177 పరుగులు చేశాడు. వార్నర్ కూడా ఈ వరల్డ్‌కప్ అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. స్మిత్ కూడా జోరుమీదున్నాడు. లబుషేన్, ఇంగ్లిస్‌లు కూడా బ్యాట్‌ను ఝులిపిస్తున్నారు. అంతేగాక కమిన్స్, జంపా, హాజిల్‌వుడ్, అబాట్, స్టోయినిస్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి.
గెలుపే లక్షంగా..
మరోవైపు సౌతాఫ్రికా కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. డికాక్, బవుమా, వండర్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్, క్లాసెన్, మార్‌క్రమ్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఈ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తోంది. బౌలింగ్‌లో కూడా సౌతాఫ్రికా బలంగా ఉంది. మార్కొ జాన్‌సెన్, ఎంగిడి, రబడా, కోయెట్జి, కేశవ్ మహారాజ్ వంటి స్టార్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో దక్షిణాఫ్రికా టీమ్‌కు కూడా గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో సెమీస్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News