ఉత్తర్‌కాశీ : ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలి ఐదురోజులుగా దాదాపు 40 మంది కూలీలు లోపల చావుబతుకుల మధ్య బందీలుగా ఉన్నారు. ఛార్‌దామ్ మార్గంలో నిర్మిస్తున్న టన్నెల్ ఆదివారం కూలింది. ఈ సమయంలో కూలీలు పలువురు నిర్మాణ పనులలో ఉన్నారు. చిక్కుపడ్డ కూలీల వెలికితీత అత్యంత క్లిష్టతరం అవుతోంది. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రంగంలోకి దింపిన యంత్రం సరిగ్గా పనిచేయలేదు. దీనితో వెంటనే ఇక్కడికి ప్రత్యేక మిషిన్‌ను రప్పించినట్లు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) చీఫ్ అతుల్ కర్వాల్ గురువారం మీడియాకు తెలిపారు. మరో 15 గంటలలో లోపలి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని , ఈ విశ్వాసం ఉందని వివరించారు. అమెరికాకు చెందిన ఔగెర్ డ్రిల్లు మిషన్ సాయంతో 70మీటర్ల రాతిని కోయడం ద్వారా టన్నెల్‌లో చిక్కుపడ్డ వారిని బయటకు తీసుకువచ్చే పనులు చేపట్టారు.
ఇప్పటికే చాలా వరకూ రాతిని తొలిగించినట్లు వివరించారు. ఇప్పుడు గంటకు కనీసం ఐదు మీటర్ల చొప్పున వాస్తవిక స్పీడ్‌తో మెషిన్ ద్వారా తవ్వకాలు జరుగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. లోపలి కార్మికులకు ఎప్పటికప్పుడు రంధ్రాల ద్వారా ఆహారం , ఆక్సిజన్ పంపిణీ జరుగుతోంది. మిషన్ ద్వారా లోపలికి నిర్థిష్ట కొలతలు ( 80 ఎంఎం అంటే 2.పైప్ 5 ఫీటును) ప్రవేశపెడుతారు. దీని ద్వారా కార్మికులు పైకి పాకుతూ రావడానికి వీలుంటుంది. ఎవరైనా గాయపడి, కదలలేని స్థితిలో ఉంటే వారి కోసం స్ట్రెచర్స్, నిచ్చెనలు జారవిడిచి వెలికి తీసేందుకు యత్నిస్తామని వివరించారు. సొరంగ నిర్మాణ పనులు సాగుతున్న సమయంలో ఆదివారం పై భాగం కొంత మేర కూలడం ప్రమాదానికి దారితీసింది. లోపల భారీ ఎత్తున రాళ్లు పడటంతో కూలీలు బయటకు రాలేని స్థితి ఏర్పడింది. ఇప్పుడు పరిస్థితిని గమనించి ప్రత్యేక యంత్రాన్ని రప్పించారు. ప్రమాద స్థలిలో పరిస్థితి ఉద్రిక్తంగా, ఉద్విగ్నంగా ఉందని సహాయక అధికారి తెలిపారు. కూలీలను వెలికితీసే మార్గంలో అడ్డంకులు ఏర్పడ్డాయని నిస్సహాయత వ్యక్తం చేశారు.
లోపలి ఇనుపరాడ్లు సహాయక చర్యలకు అడ్డుపడుతున్నాయి. ఇప్పుడు కూలిన టన్నెల్‌లోకి పంపించే పైపులు కేవలం మూడు అడుగుల వెడల్పు వరకూ ఉన్నాయి. వీటి ద్వారానే లోపల ఉన్న కూలీలు బయటకు రావల్సి ఉంటుంది. లోపలి కూలీలు ఎటువంటి శారీరక గాయాల స్థితిలో ఉన్నారనేది తెలియదు. వీరు ఏ విధంగా బయటకు రాగల్గుతారనేది చెప్పడం ఎవరికి అంతుపట్టని విషయం అయింది. సహాయక చర్యల కోసం ఇప్పటికే థాయ్‌లాండ్, నార్వేకు చెదిన రెస్కూ టీంలను కూడా సంప్రదిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని బ్రహ్మకాల్ యమునోత్రి నేషనల్ హైవేపై ఈ నాలుగున్నర కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తున్నారు. ఛార్‌దామ్ ప్రాజెక్టులో భాగంగా దీనిని తలపెట్టారు. దీని నిర్మాణం పూర్తి అయితే ఉత్తర్‌కాశీలోని సిల్కయారా దండలగాన్ మధ్య ప్రయాణ దూరం 26 కిలోమీటర్ల మేర తగ్గుతుంది