Saturday, December 21, 2024

ఢిల్లీలో నకిలీ డాక్టర్ల గుట్టు రట్టు..నలుగురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఆస్పత్రిని నిర్వహిస్తూ రోగుల మరణాలకు కారకులౌతున్న నలుగురు నకిలీ డాక్టర్ల ముఠాను పోలీస్‌లు అరెస్టు చేయగలిగారు. ఈ నలుగురిలో ఓ మహిళా సర్జన్ ,ల్యాబ్ టెక్నీషియన్‌ను కూడా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్, డాక్టర్ జస్‌ప్రీత్ సింగ్, మాజీ లేబొరేటరీ టెక్నీషియన్ మహేందర్ సింగ్ ఉన్నారు. ఈ ఆస్పత్రిలో ఇద్దరు రోగులు ఇటీవల మరణించడంపై దర్యాప్తు చేపట్టగా ఈ నకిలీ డాక్టర్ల ముఠా గుట్టు బయటపడింది. పోలీస్‌ల వివరాల ప్రకారం అస్ఘర్ అలీ అనే రోగి గాల్‌బ్లేడర్ (పిత్తాశయం) చికిత్సకోసం ఆస్పత్రిలో 2022లో అడ్మిట్ అయ్యాడు. సర్జరీ డాక్టర్ జస్‌ప్రీత్ అనే అర్హులైన డాక్టర్ చేస్తారని మొదట చెప్పారు. కానీ ఆపరేషన్‌కు ముందు డాక్టర్ జస్‌ప్రీత్‌కు బదులు పూజా, మహేంద్ర పాల్గొన్నారు. ఆపరేషన్ గది నుంచి బయటకు వచ్చిన తరువాత అలీ విపరీతమైన నొప్పికి గురికావడంతో సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ఆయన చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. రోగి కుటుంబీకులు ఫిర్యాదుపై వీరి బండారం బయటపడింది. వీరు నకిలీ డాక్టర్లని తేలింది. ఈ కేసు దర్యాప్తులో గ్రేటర్ కైలాశ్ ఆస్పత్రిలో 2016 నుంచి తొమ్మిది మంది రోగులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారని బయటపడింది. కేవలం ఫిజీషియన్ మాత్రమే అయిన డాక్టర్ నీరజ్ అగర్వాల్ అక్రమంగా సర్జరీలు చేస్తున్నట్టు తేలింది. మొత్తం ఏడు కేసుల్లో రోగులు వైద్య నిర్లక్షం వల్లనే చనిపోయారని పోలీస్‌లు వెల్లడించారు. నవంబర్ 1న నలుగురు డాక్టర్లతో కూడిన మెడికల్ బోర్డు ఈ ఆస్పత్రిని తనిఖీ చేసింది. అనేక అవకతవకలను గుర్తించింది. డాక్టర్ల సంతకాలు ఉన్న414 ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లు, ప్రిగ్నెన్సీ టర్మినేషన్‌కు చెందిన వివరాలతో ఉన్న రెండు రిజిస్టర్లు , గడువు ముగిసిన సర్జికల్‌బ్లేడ్లు, పేషెంట్ల ఒరిజినల్ బిల్లులు పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. 47 బ్యాంకులకు చెందిన చెక్కుబుక్కులు, 54 ఏటిఎం కార్డులు, పాస్‌పోర్టులు, క్రెడిట్ కార్డు మెషీన్లను అగర్వాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News