Friday, December 20, 2024

హమాస్ నేత హనియా ఇల్లు నేలమట్టం

- Advertisement -
- Advertisement -

గాజాస్ట్రిప్ : ఇజ్రాయెల్ సేనలు తమ భూతల దాడుల్లో భాగంగా గురువారం హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియా నివాసాన్ని ధ్వంసం చేశాయి. ఆయన తనకు తాను గాజా రాజకీయ వ్యవస్థకు అధినేతగా పేర్కొంటూ చక్రం తిప్పుతున్నారు. ఈ నేత ఇంటిని నేలమట్టం చేసిన దృశ్యాలను తెలిపే వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఆ తరువాత సామాజిక మాధ్యమాలకు పంపించింది. ఫైటర్ జెట్ విమానాలు ఓ ఇంటిపై బాంబులు కురిపిస్తూ వచ్చిన వైనం ఈ వీడియోలో ఉంది. ఇది హమాస్ నేత ఇల్లు అని వివరణ ఇచ్చారు. గాజాను పాలించే పొలిటికల్ బ్యూరోకు అధినేతగా ఉన్న హనియాను పలు దేశాలు హమాస్ సంస్థ చీఫ్‌గా పేర్కొంటున్నాయి. హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు అన్ని కూడా ఈ ఇంటి నుంచి సాగుతున్నాయని తాము గుర్తించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. తమకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఇంటిని ధ్వంసం చేసినట్లు వివరించారు. తరచూ ఈ ఇంటికి హమాస్ సీనియర్ నేతలు వచ్చిపోతూ ఉంటారు.

ఇక్కడి నుంచే ఇటీవలి కాలంలో దాడులకు పెద్ద ఎత్తున వ్యూహాలు పన్నుతున్నట్లు తేలిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది. తమ పౌరులపై, సైనికులపై , రక్షణ వ్యవస్థలపై ఇక్కడి నుంచి దాడులకు పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతున్న విషయాన్ని సకాలంలో గుర్తించామని అధికారులు తెలిపారు. 1990 ప్రాంతం నుంచి హనియా వెలుగులోకి వచ్చారు. హమాస్ వ్యవస్థాపకులలో ప్రముఖుడిగా నిలిచారు. హమాస్ వ్యవస్థాపక నేత షేక్ అహ్మద్ యాసిన్‌కు కుడిభుజంగా ఉన్నారు. 2017లొ హమాస్ నేతగా హనియా ఎన్నికయ్యారు. ఎక్కువగా ఆయన తన రాజకీయ కార్యకలాపాలను గాజా వెలుపలి నుంచి నిర్వహిస్తున్నట్లు స్పష్టం అయింది. అయితే గాజాలో తన నివాసం ఎప్పుడు హమాస్ కార్యకలాపాలకు కేంద్రీకృతం అయ్యేలా చూసుకుంటున్నారు. మరో వైపు ఇజ్రాయెల్ సేనలు తమ దాడులలో భాగంగా హమాస్ నౌకాదళాలకు చెందిన భారీ ఆయుధాల నిల్వలను గుర్తించాయి. వీటిలో డైవింగ్ గేర్స్, పేలుడు పరికరాలు , పలు మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.

హమాస్ ఆసుపత్రి ఎంఆర్‌ఐ యూనిట్‌లో ఆయుధాలు
ఏ క్షణంలో అయినా అల్ షిఫా ఆసుపత్రి నేలమట్టం?
గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిలో హమాస్ వేట సాగిస్తున్న సుశిక్షిత ఇజ్రాయెల్ సేనలు భారీ స్థాయిలో మారణాయుధాలను గుర్తించాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వర్గాలు ప్రకటించాయి. ఆసుపత్రిలో హమాస్ ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న దశలో ఎంఆర్‌ఐ విభాగంలో ఆయుధాలను స్వాదీనపర్చుకున్నారు. దీనికి సంబంధించి ఫోటోలను మీడియాకు వెలువరించారు. అత్యంత కీలకమైన ఎంఆర్‌ఐ యూనిట్‌లో తాము పట్టుకున్న ఆయుధాలను ఆ తరువాత సైన్యం అధికార ప్రతినిధి జోనాథన్ క్రానికస్ మీడియా పరిశీలనకు ఉంచారు. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా హమాస్ చివరికి ఆసుపత్రిని కూడా తమ స్థావరంగా మల్చుకుందని, ఇందుకు ఇప్పుడు ఇక్కడ దొరికిన భారీ స్థాయి ఆయుధాలే నిదర్శనమని తెలిపారు. దొరికిన ఆయుధాలలో ఎకె 47లు , గ్రెనెడ్లు,పలు బ్యాగులు, మందుగుండు సామాగ్రి ఉన్నట్లు అధికారి వివరించారు. ఆయుధాలు ఉన్నట్లు గుర్తించగానే ఇజ్రాయెల్ సేనలు మరింతగా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.

ఈ ఆసుపత్రిని పూర్తిగా నేలమట్టం చేసి తీరాలని, శత్రు అవశేషాలు కూడా లేకుండా చేయాలని చూస్తున్నట్లు వెల్లడైంది. ఆసుపత్రిని కూల్చేయాలని ఇజ్రాయెల్ సేనలు బుల్‌డోజర్లు సిద్ధం చేసుకున్నాయని, రోగులకు ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదని పాలస్తీనియా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒక్కరు తెలిపారు. కాగా ఇజ్రాయెల్ బలగాలు స్పందిస్తూ ఆసుపత్రి లోపలే కాకుండా నేలమాళిగలు, సొరంగాలలో కూడా హమాస్ కార్యకలాపాలు సాగుతున్నాయని, రోగులను అడ్డుగా పెట్టుకుని ఆయుధాలు నిల్వ చేసుకున్నారని, తాము ముందుగా టన్నెల్స్ ధ్వంసం చేసి తీరుతామని ప్రకటించారు. ఈ క్రమంలో రోగులకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూస్తామని, వారికి అవసరం అయిన ఔషధాలు, ఆహారం వంటివి తామే సరఫరా చేస్తున్నామని తెలిపారు. హమాస్ చర్యలకు ఆసుపత్రులను వాడుకుంటూ వేలాది మంది ప్రాణాలతో చెలగాటమాడిందని, ఇక దీనిని అడ్డుకుంటూ మరో వైపు హమాస్‌ను దెబ్బతీయడం జరుగుతుందని సైనిక ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News