భోపాల్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రమంలో శక్రవారం కీలక పోలింగ్ ఘట్టం జరుగనుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రెండో తుది దఫా పోలింగ్ జరుగుతుంది. ఇదే రోజు అత్యంత కీలకమైన బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌లో తొలివిడత ఓటు పడనుంది. ఈ రెండు రాష్ట్రాలలో శుక్రవారం నాటి ఓటు రెండు ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌లకు అత్యంత కీలకం కానున్నాయి. తిరిగి అధికారంలోకి రావాలని మధ్యప్రదేశ్‌లో బిజెపి తరఫున సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ యత్నిస్తున్నారు. ఇంతకు ముందటి వరకూ రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న కాంగ్రెస్ ఈ సారి అంతర్గత విభేదాలు వీడి అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదిపింది. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రభావం ఎన్నికలలో కన్పిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన పలు సభలతో , డబుల్ ఇంజిన్ పాలన సత్ఫలితాలతో తిరిగి విజయం ఖాయం అని బిజెపి విశ్వసిస్తోంది. నక్సల్స్ ప్రభావితం అయిన ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాలకు గాను ఈ నెల 7వ తేదీన 20 స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఈ స్థానాలు అత్యధికంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఉన్నాయి. కాగా ఇప్పుడు శుక్రవారం మిగిలిన 70 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది. దీనితో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరుసలో పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితం నిరీక్షణ రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలుస్తుంది. ఏ ఫలితం అయినా డిసెంబర్ 3నే వెలువడేది. తొలి దశ పోలింగ్‌లో అత్యధికంగా 78 శాతం ఓటింగ్ జరిగింది. ఎన్నికల బహిష్కరణకు నక్సల్స్ పిలుపు ఇచ్చినా, పోలింగ్ రోజున దాడులు, ఎన్‌కౌంటర్ జరిగినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. షఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ 15 ఏండ్ల విరామం తరువాత తిరిగి 2018లో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో పవర్ కోసం బిజెపి సర్వశక్తులు ఒడ్డింది. కాగా ఇక్కడ ఇప్పుడు బిజెపిని బలంగా ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఆప్, బిఎస్‌పి, ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి కూడా పోటీ తాకిడి ఎదురైంది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఇండియా విపక్ష కూటమి ఐక్యత కన్పించలేదు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. తమకు 75కు పైగా సీట్లు వస్తాయని పేర్కొంటున్నారు. బిజెపికి ఇక్కడ స్థానం లేదని తెలియచేసుకుంటున్నారు. 2003 నుంచి 2018 వరకూ విరామం లేకుండా 15 ఏండ్లు అధికారంలో ఉన్న తమకు ప్రజలు తిరిగి పట్టం కడుతారని బిజెపి ఆశిస్తోంది.
మొత్తం 22 జిల్లాల్లో 70 స్థానాలకు పోలింగ్
శుక్రవారం జరిగే పోలింగ్ పరిధిలోకి మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. 22 జిల్లాలను విస్తరించుకుని ఇవి ఉన్నాయి. కాగా మొత్తం ఓటర్లు 1,63,14,479… వీరిలో 81,41,624 మంది పురుషులు, 81,72,171 మంది స్త్రీలు. 684 మంది థర్డ్‌జెండర్ వారున్నారు. ఇప్పుడు మొత్తం మీద బరిలో 958 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 827 మంది పురుషులు. 130 మంది మహిళలు. ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు మొత్తం 18,833 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
230 స్థానాలకు ఒకే విడత పోటీ
మధ్యప్రదేశ్‌లో నువ్వానేనా ఉంటుందా?
అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయి పోటీ ఉన్న మద్యప్రదేశ్‌లో శుక్రవారం ఒకే విడత పోలింగ్ జరుగుతుంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఓటర్లు రంగంలోకి దిగనున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రక్రియ ఆరంభమవుతుంది. 5.6 కోట్ల మంది ఓటర్లు ఉన్న మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ప్రక్రియ అతి భారీ స్థాయిది అని చెప్పాల్సిందే. ఓటర్లలో 2.88 కోట్ల మంది మగవారు. 2.72 కోట్ల మంది ఆడవారు ఉన్నారు. ఈసారి తొలిసారిగా ఓటుకు దిగే యువత సంఖ్య 22 లక్షలకు పైగా ఉంది. బిజెపి, కాంగ్రెస్‌లకు మధ్యప్రదేశ్ అత్యంత కీలక రాష్ట్రం కానుంది. ఈ రాష్ట్రంలో గెలిచే పార్టీ వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు వీలుంటుంది. అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాలు ఉండటంతో రాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రత్యేకించి బిజెపికి కీలకం అయ్యాయి. కాంగ్రెస్ తరఫున పాతనేత కమల్‌నాథ్ తిరిగి సిఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాగా ఈసారి విచిత్ర రీతిలో బిజెపి తరఫున ఇప్పటి సిఎం శివరాజ్‌తో పాటు ఇతరులు కొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. చింధ్వారా స్థానం నుంచి కమల్‌నాథ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్థి వివేక్ బంటీ సాహుతో తలపడుతున్నారు.
2019 ఎన్నికలలో ఇక్కడ కమల్ గెలిచారు. ఇండోర్ 1 నుంచి కైలాష్ విజయ్‌వర్గీయ బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సంజయ్ శుక్లా నిలిచారు. కాగా బుధ్నీ సీటు నుంచి సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి విక్రమ్ మస్తాల్ పోటీలో నిలిచారు. నర్సింగ్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బిజెపి తరఫున పోటీకి నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి లఖన్ సింగ్ పటేల్ ఉన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ బిజెపి తరఫున ఎక్కువగా సభలకు వచ్చారు. కాగా కాంగ్రెస్ తరఫున రాహుల్ , ప్రియాంకలు ప్రచారంలో తిరిగినా స్థానిక నేత కమల్‌నాథ్ ఇమేజ్ కాంగ్రెస్‌కు మలుపు తిప్పే అంశం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.