Sunday, December 22, 2024

నిష్ఫల చర్చలు!

- Advertisement -
- Advertisement -

ఒకరిని చూసి మరొకరు భయపడుతూనే, పరస్పరం అనుమానించుకొంటూనే అమెరికా, చైనాలు చర్చల పేరిట సాగిస్తున్న దౌత్యం వల్ల ప్రపంచానికి చెప్పుకోదగిన మేలు కలుగకపోడం సహజం. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ రెండు దేశాల అధినేతల కలయిక వల్ల అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం నుంచి కాని, గాజాలో పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల నుంచి కాని ప్రపంచానికి ఊరట లభించకపోడం గమనించవలసిన అంశం. బుధవారం నాడు అమెరికాలోని కాలిఫోర్నియా ఎస్టేట్‌లో ప్రెసిడెంట్ జో బైడెన్ చైనా అధినేత జీ జిన్‌పింగ్ మధ్య 4 గం. పాటు ముఖాముఖీ చర్చలు సంభవించాయి. సాధారణంగా శిఖరాగ్ర చర్చల తర్వాత విడుదల చేసే సంయుక్త ప్రకటన వంటిది వెలువడలేదు. అందుచేత ఇది అధినేతలు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణగానే మిగిలిపోతుంది. ఇటీవలి కాలంలో రెండు దేశాల సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్టంభనను ఈ చర్చలు కొంత వరకు సడలించాయని చెప్పుకోవచ్చు. గత ఫిబ్రవరిలో అమెరికాపై విహరించిన చైనా గూఢచార బెలూన్‌ను వాషింగ్టన్ కూల్చివేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

దానికి ఈ చర్చలు ముగింపు చెప్పాయి. తమ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఘర్షణలకు దారి తీయకుండా జాగ్రత్త పడవలసిన అవసరాన్ని అధినేతలు ఉభయులూ గుర్తించారు. అందుచేత సైన్యాల మధ్య సమాచార సంబంధాలను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించారు. అత్యవసరాల్లో తామిద్దరు కూడా పరస్పరం మాట్లాడుకొనేందుకు వీలు కల్పించుకోవాలని అనుకొన్నారు. చైనా నుంచి అమెరికాలోకి హద్దు ఆపూ లేకుండా వస్తున్న ప్రమాదకరమైన డ్రగ్ ఫెంటానిల్ ముడి పదార్థాలను అరికట్టడానికి జీ జిన్‌పింగ్ అంగీకరించడం చర్చల వల్ల కలిగిన మరో ఫలితంగా చెప్పుకొంటున్నారు. 2016లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో , 2018లో డోనాల్డ్ ట్రంప్‌తో జరిపిన చర్చల్లో కూడా చైనా ఇటువంటి హామీనే ఇచ్చిందని అది అమల్లోకి రాలేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కృత్రిమ మేధకు పరిమితులు విధించే విషయమూ ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నారు. తైవాన్ విషయంలో చైనా తన ప్రకటిత ధోరణి నుంచి ఈనిపుల్లంత దూరం కూడా జరగకపోడం విశేషం కాదు. తైవాన్ ప్రజాస్వామ్యాన్ని హర్షించాలని బైడెన్ కోరగా దానిని చైనాలో కలుపుకోడం, ఒకే చైనా లక్షాన్ని సాధించడం మానుకోబోమని జీ నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు.

అలాగే అమెరికాను దెబ్బ తీసే ఆలోచనలేవీ తమకు లేవని అదే విధంగా వాషింగ్టన్ కూడా తమను నష్టపరిచే పనులకు సాహసించ వద్దని జో బైడెన్‌తో జిన్‌పింగ్ చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇది అమెరికా అనుకూల మీడియా కావాలని చేస్తున్న ప్రచారం కావొచ్చు. ఆర్థికంగా, సైనికంగా ఒకరినొకరు సవాలు చేసుకొంటున్న స్థితిలో చైనా అధినేత ఇలా అని వుంటారని భావించలేము. గాజా పరిస్థితిని జీ ప్రస్తావించగా ఇరాన్‌ను మీరు అదుపులో వుంచండని బైడెన్ ఆయనకు హితవు చెప్పినట్టు కూడా వార్తలు వెల్లడిస్తున్నాయి. అంతేగాని ఇజ్రాయెల్‌ను తాను గాజా నుంచి వెనక్కి రప్పిస్తానని బైడెన్ హామీ ఇవ్వకపోడం బాధాకరం. గాజాలో చనిపోతున్న వేలాది మంది పసిబిడ్డల ప్రాణాలపై అధినేతలిద్దరూ ఆందోళనపడకపోడం విషాదం. చైనా చుట్టూ ఉచ్చు బిగించడానికి అందుకు ఇండియాను ఉపయోగించుకోడానికి అమెరికా నిరంతరం కృషి చేస్తున్న మాట వాస్తవం. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును అరికట్టడానికి క్వాడ్ ఒప్పందం కుదుర్చుకోడంలో, ఇండియాకు విశేషంగా ఆయుధాలు విక్రయించడంలో ఇది కనిపిస్తూనే వుంది. ఇండియాను అమెరికా ఈ విధంగా దగ్గరకు తీసుకొంటున్న కొద్దీ చైనా మనతో గల సరిహద్దులను అతిక్రమించడానికి అదే పనిగా ప్రయత్నిస్తున్నది. ఆ విధంగా అమెరికా వైఖరి భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నది.

జీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనలో భాగంగా ఆసియా, పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సభలకు హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ తాము ఎవరి భూభాగాన్ని ఆక్రమించలేదని, యుద్ధాన్ని కోరడం లేదని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆచరణలో యుద్ధానికి కాలు దువ్వుతూ మాటల్లో శాంతి పన్నాలు పలకడం చైనాకు కొత్త కాదు. ప్రపంచం కుగ్రామంగా మారిందని, హద్దులన్నీ చెరిగిపోయి వసుధైకత ఏర్పడుతున్నదని చెప్పుకోడమే గాని వాస్తవంలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్న సంగతిని ఎవరూ కాదనలేరు. రోజురోజుకీ కొత్త యుద్ధ క్షేత్రాలు తెరుచుకొంటున్నాయి. ప్రాంతీయ సహకారం మెరుగుపడుతున్నట్టు కనిపిస్తున్నా ఇరుగుపొరుగులు ఒకరినొకరు ద్వేషించుకొనే వాతావరణం కొనసాగుతున్నది, కొన్ని చోట్ల పేట్రేగుతున్నది. పోటాపోటీగా అణ్వస్త్రాలను తయారు చేసుకొంటూ యుద్ధ వ్యూహాలను రచించుకొంటూ ఇటువంటి చర్చలు, తీపి మాటలతో కాలం గడపడం ప్రపంచ శాంతికి ఎంత మాత్రం ఉపయోగపడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News