హైదరాబాద్: భారత జట్టు సెమీస్ గెలిచి ఫైనల్‌కు చేరడంతో భారతీయులకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఫైనల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఫైనల్‌లో భారత్ గెలుస్తుందా? లేదా? అనే దానిపై బెట్టింగులు జరుగుతున్నాయి. ఇప్పటికే టీమిండియా ఒక్క ఓటమి లేకుండానే ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియా మాత్రం తొమ్మిదింట్లో రెండు ఓటమిలతో ఫైనల్‌కు చేరుకుంది. 2003లో జరిగిన ప్రతీకారాన్ని ఇప్పుడు తీర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాజీ ఆటగాడు గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు నుంచి గేమ్ ఛేంజర్ ఎవరు అవుతారు అనే దాని చర్చ జరగగా టక్కుమని గంభీర్ సమాధానం చెప్పాడు.
శ్రేయస్ అయ్యర్ గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గేమ్ ఛేంజర్ లిస్టులో కోహ్లీ, రోహిత్, షమీలు లేరని శ్రేయస్ ఉన్నాడని సమాధానం ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. సెమీఫైనల్‌లో 70 బంతుల్లోనే సెంచరీ చేసి వావ్ అనిపించాడు. మిడిల్ ఆర్డర్‌లో అత్యధిక రన్స్ బాదిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. వరల్డ్ కప్‌లో శ్రేయస్ రెండు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలతో 526 పరుగులు చేశాడు.