నల్లగొండ ఎంపి, హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు తాను గడ్డం తీయనని గతంలో చేసిన చాలెంజ్‌పై మరోసారి ఆయన స్పందించారు. డిసెంబర్ 3వ తేదీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, డిసెంబర్ 09వ తేదీన క్లీన్ షేవ్‌తో కనిపిస్తానని ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు అమలు అవుతున్నాయని, తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన తాను మళ్లీ క్లీన్ షేవ్‌తో కనిపిస్తానని ఉత్తమ్ అనడం ప్రస్తుతం ఈ విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.