గద్వాల: బిజెపిని గెలిపిస్తే తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. నడిగడ్డ ప్రాంతమైన గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో బిజెపిని గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటుందని అన్నారు. శనివారం సకల జనుల సంకల్ప సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అమిత్ షా మాట్లాడుతూ ఐదవ శక్తీపీఠమైన అలంపూర్, బిచ్‌పల్లి ఆంజనేయస్వామి వెలిసిన ప్రాంతంలో రావడం తన అదృష్టమని తెలిపారు. జోగులాంబ ఆలయానికి బిజెపి ప్రభుత్వం రూ. 70 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. కెసిఆర్ జోగులాంబ దేవాలయానికి ఇస్తామన్న రూ.100 కోట్లు ఎక్కడ అని ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు బిజెపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
నరేంద్ర మోడీ పాలనలో దేశంలో అన్ని రంగాల్లో ముందుకుపోతుందని ప్రపపంచంలో నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుల్లో సఖ్యత లేదని వారిలో వారే విమర్శలు చేసుకుంటున్నారని అమిత్‌షా అన్నారు. తమ ప్రభుత్వం వస్తే వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. బిజెపి ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు రెండు లక్షల 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ముస్లింలకు ఇచ్చే మత పరమైన రిజర్వేషన్లు రద్దు చేసి ఒబిసి ఎస్టీలకు ఇస్తామన్నారు. అయోధ్య రామ మందిరం పూర్తయితే అందరికి ఉచితంగా దర్శనం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాద్యక్షురాలు డి.కె. అరుణ, గద్వాల అభ్యర్థి శివారెడ్డి, రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
………