మాలే : తమ దేశం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం భారతదేశానికి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ప్రెసిడెంట్ మెహమ్మద్ ముయిజు కార్యాలయం నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. ఒక్కరోజు క్రితమే ముయిజు దేశాధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు మాల్దీవుల పర్యటనలో ఉన్న భారత ఎర్త్‌సైన్సెస్ మంత్రి కిరెన్ రిజిజుతో భేటీ అయిన సందర్భంగా సైన్యం వాపసీ విషయాన్ని ముఖాముఖీ ప్రస్తావించినట్లు తెలిసింది. తరువాత మాల్దీవుల డిమాండ్ అధికారికంగా వెల్లడైంది. దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి భారతదేశం తరఫున రిజిజు హాజరయ్యారు.
భౌగోళికంగా మాల్దీవులు అత్యంత కీలకమైన సముద్ర ప్రాంతంలో ఉన్నాయి. ఈ దీవిలో ఇప్పుడు దాదాపు 70 మంది వరకూ భారతీయ సైనికులు ఉన్నారు. వీరు రాడార్ల నిర్వహణ, విమానాల నిఘా వంటి చర్యలకు దిగుతున్నారు. కాగా భారతీయ యుద్ధ విమానాలు మాల్దీవుల పూర్తిస్థాయి ఎకనామిక్ జోన్ల గస్తీలో అక్కడి సేనలకు సహకరిస్తున్నాయి. భారత సేనల ఉపసంహరణ డిమాండ్‌తో ఇప్పుడు కొత్త నేత ఆధ్వర్యంలో ఈ దేశం ఇక చైనా వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వెల్లడైంది.