Friday, January 10, 2025

బిజెపికి చుక్కలు చూపిస్తున్న ఏక్‌నాథ్!

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో ఎన్ని వత్తిడులు తెచ్చినా, బెదిరింపులు చేసినా ఉద్ధవ్ థాకరే లొంగి రాకపోవడంతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను రంగంలోకి దింపి, బెదిరించి ఆయన ఎంఎల్‌ఎలను చీల్చి, ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా శివసేన పార్టీకి కాలం చెల్లిన్నట్లుగా బిజెపి నేతలు అంచనాలు వేసుకున్నారు. ఆ పార్టీ ఉన్నంత వరకు ఆ రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ సాధింపలేమని గ్రహించారు. షిండే తనతో పాటు ఎంఎల్‌ఎలను అయితే తీసుకొచ్చి, బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పడ గలిగినా శివసేనకు గల అసలైన ఓటర్లను మాత్రం తీసుకురాలేకపోయారు. పేరుకు ఆయనే ముఖ్యమంత్రి అయినా ఉపముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ మొత్తం ప్రభుత్వ వ్యవహారాలను నడిపిస్తున్నారు.అయితే, ఇదే ప్రభుత్వం కొనసాగితే వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం తప్పదని గ్రహించి ఎన్‌సిపి నేతలను దరిచేర్చుకున్నారు. ఎప్పటి నుండో ముఖ్యమంత్రి పదవిపై ఆశపెట్టుకున్న అజిత్ పవర్‌ను సిఎం చేస్తామనే భరోసాతో, సిబిఐ, ఇడి కేసులు ఎదుర్కొంటున్న వారందరికీ మంత్రి పదవులు ఇచ్చి రాజకీయంగా పెద్ద ప్రకంపనలు తీసుకు వచ్చామని బిజెపి అగ్రనేతలు సంబరపడటం ప్రారంభించారు.

అయితే తన ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెడుతున్నారని గ్రహించిన షిండే మేల్కొని బిజెపి ఎత్తుగడలను చిత్తుచేయడం ప్రారంభించారు. త్వరలో అజిత్ పవర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన పార్టీకి చెందిన మంత్రులు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. అటువంటి ప్రకటనలను బిజెపి ఖండిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. అదే జరిగితే ప్రభుత్వ మనుగడ కష్టమనే సంకేతం షిండే మద్దతుదారులు ఇస్తున్నారు. మూడు వారాల క్రితం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విదర్భలోని యావత్మాల్‌కు ‘మీ ఇంటి వద్దే ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లగా, తన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడంతో దిగ్భ్రాంతి చెందారు. చత్తీస్‌గఢ్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికల ప్రచారంలో ఉండగా, తనకు డెంగ్యూ సోకినట్లు అజిత్ పవార్ తెలిపారు.
ఇదే సమయంలో మరాఠాలకు రిజర్వేషన్లపై రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ సంక్షోభం విషయంలో సహితం వారిద్దరూ తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తూ ఉండటం గమనించారు. అప్పటి వరకు జనానికి పెద్దగా తెలియని మనోజ్ జరంగే పాటిల్ ఈ విషయమై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి దారి తీయడం తన ప్రభుత్వాన్ని అస్థిరం కావించే కుట్రగా గమనించారు.ఈ పరిస్థితులను షిండే ఓ సవాల్‌గా స్వీకరించారు.

తాను ‘కీలుబొమ్మ’ ముఖ్యమంత్రిని కాదని ఫడ్నవీస్, అజిత్ పవర్ శిబిరాలకు స్పష్టమైన సందేశం పంపేందుకు కసరత్తు చేస్తున్నారు. అనర్హత వేటు తప్పకపోవచ్చని భావిస్తున్న తన మద్దతుదారులైన ముగ్గురు మరాఠా ఎంఎల్‌ఎలతో ఈ అంశంపై రాజీనామా అస్త్రం ప్రయోగించారు.జారంగే పాటిల్‌ను బుజ్జగించేందుకు షిండే చొరవ తీసుకొని రిజర్వేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జారంగే పాటిల్‌తో తన ఆందోళనను తాత్కాలికంగా విరమింప చేశారు. ఢిల్లీలోని బిజెపి పెద్దలతో నేరుగా సంప్రదింపులు జరపడం ప్రారంభించారు. మరో వంక, గత వారం జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో, అధికార సంకీర్ణంలోని వివిధ పార్టీల మంత్రుల మధ్య అంతర్గత పోరుపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు మరింత సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వం ఓ జట్టుగా పని చేస్తున్నట్లు ప్రజలకు సందేశం వచ్చేటట్లు చూడాలని దృఢంగా చెప్పారు. బహుశా మొదటిసారి ముఖ్యమంత్రిగా దృఢంగా, స్వతంత్రంగా వ్యవహరించడం చూసి బిజెపి, ఎన్‌సిపి నేతలు విస్మయం చెందుతున్నారు.ముఖ్యమంత్రి పదవి ఇస్తే తమ చెప్పుచేతల్లో ఉంటారనుకున్న షిండే ఇప్పుడు బిజెపి నేతలకు చుక్కలుచూపించే ప్రయత్నం చేస్తున్నారు.

తనను పక్కన పెట్టి అజిత్ పవర్‌ను ఏవిధంగా ముఖ్యమంత్రిగా చేస్తారని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. నెల రోజుల క్రితమే బిజెపి, షిండే, అజిత్ పవర్ మద్దతుదారులైన ఎంఎల్‌ఎలు, ఎంపిల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గానికి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ మూడు శిబిరాల మంత్రు లు, నాయకుల మధ్య విభేదాలు తరచూ బహిర్గతం అవుతున్నాయి. ఉమ్మడిగా వున్నట్లు చూపే ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు.షిండే, అజిత్ పవర్ తరచూ ఢిల్లీ వెడుతూ అమిత్ షా, ఇతర ప్రముఖులను కలుస్తున్నప్పటికీ సయోధ్య ఆచరణలో కనిపించడం లేదు. ఒక వంక మరాఠా రిజర్వేషన్ అంశంపై తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని ఉపశమింప చేసేందుకు షిండే తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో అజిత్ పవర్ వర్గానికి చెందిన ఛగన్ భుజ్‌బల్ మరాఠాలకు ఒబిసి కేటగిరీలో రిజర్వేషన్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ తన సొంత ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఒబిసి కోటాలో మరాఠాలకు దొడ్డిదోవన రిజర్వేషన్లు కల్పించే ఎటువంటి ప్రయత్నం చేసినా తాము వీధుల్లోకి వచ్చేటట్లు చేస్తుందని అంటూ హెచ్చరిక చేశారు. దీనికి ప్రతీకారంగా, ‘భుజ్‌బల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సంకీర్ణ ప్రభుత్వానికి హానికరం’ అంటూ షిండే వర్గానికి చెందిన మంత్రి శంభురాజ్ దేశాయ్ చురకలు అంటించారు.

అజిత్ పవర్ ప్రభుత్వంలో చేరగానే ఎంతో ఉత్సాహంగా పని చేయడం ప్రారంభించారు. ‘సుప్రీం సిఎం’గా పేరు తెచ్చుకున్నారు. త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారని సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓ నెల రోజుల పాటు ఈ వ్యవహారాన్ని మౌనంగా గమనిస్తూ వచ్చిన షిండే అకస్మాత్తుగా ఫైళ్లను సిఎంఒ ద్వారా మళ్లించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వు ఇవ్వడం ద్వారా ‘అసలు సిఎం షిండే’ అని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. షిండే ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తుండడం సహజంగానే అజిత్ పవర్ శిబిరంలో అసహనానికి దారితీస్తుంది. పైగా, పవర్ వర్గానికి చెందిన మరి కొందరు ఎంఎల్‌ఎలకు అవకాశం ఇచ్చేందుకు మంత్రి వర్గం విస్తరించాలని ఎన్ని వత్తిడులు వస్తున్నా షిండే వాయిదా వేస్తూ వస్తున్నారు.
దానితో షిండే- పవర్‌ల మధ్య సయోధ్య కుదర్చడం బిజెపికి జటిల సమస్యగా మారుతుంది. వచ్చే ఏడాదిలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిని మార్చడం రాజకీయం గా సాధ్యం కాకపోవచ్చని నిర్ణయానికి వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి దక్కదని స్పష్టమైతే పవర్ ఎంతకాలం కలిసి ఉంటారన్నది కూడా సందేహాస్పదమే. షిండే, పవర్ ఇద్దరూ తమతో ఎంఎల్‌ఎలను తీసుకొచ్చినా శివసేన, ఎన్‌సిపి ఓటర్లను మాత్రం తీసుకు రాలేకపోతున్నట్లు స్పష్టం అవుతుంది.

దానితో రాబోయే లోక్‌సభ ఎన్నికలు బిజెపికి అగ్నిపరీక్షగా మారే ప్రమాదముంది. మరోవంక, షిండే ‘అసలైన మరాఠా నేత’ గా వ్యవహరిస్తూ ఉండడంతో ప్రభుత్వంలో అజిత్ పవర్‌కు ప్రాధాన్యత లేకుండా పోతుంది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలో సహితం ఇటువంటి పరిస్థితి లేకపోవడంతో షిండే కింద పని చేయడం ఇబ్బందికరంగా మారింది. ఉత్తరప్రదేశ్, బీహార్ తర్వాత దేశంలో ఎక్కువ మంది ఎంపిలు మహారాష్ట్రలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఎంపి, ఎంఎల్‌ఎల దామాషాలో తమకు సీట్లు ఇవ్వాలని షిండే, అజిత్ పవర్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ విధంగా చేస్తే బిజెపి దాదాపు సగం సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకు ఎట్టి పరిస్థితుల్లో బిజెపి సిద్ధపడే అవకాశం లేదు. మహారాష్ట్రలో దాదాపు సగం సీట్లను కోల్పోతే ఆ మేరకు దేశంలో మరే రాష్ట్రంలో కూడా అదనంగా సీట్లు గెలుచుకునే పరిస్థితులు బిజెపికి కనిపించడం లేదు. అందుకనే లోక్‌సభలో సొంతంగా మెజారిటీ కొనసాగేటట్లు చేయాలంటే మహారాష్ట్ర ఎన్నికలు కీలకం కానున్నాయి. కానీ, షిండే, అజిత్ పవర్ వర్గాలు ఎవరికి వారుగా తమ ప్రాబల్యం కోసం ప్రయత్నం చేస్తుండటం బిజెపికి తల నొప్పిగా మారుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News