హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ఎంతవరకైనా కొట్లాడతదన్న ఉద్ధేశ్యంతో వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఒప్పించి బిజెపిలో చేరేలా చేశానని మాజీ ఎంపి విజయశాంతి పేర్కొన్నారు. గతంలో బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు అనేక మంది బిజెపి ప్రముఖులు ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తేనే తాను కూడా బిజెపిలో చేరానని ఆమె గుర్తుచేశారు. కానీ, బిజెపి ఇందుకు భిన్నంగా వ్యవహారించడంతోనే పార్టీ నుంచి ముగ్గురం బయటకు వచ్చేశామన్నారు.
ఇకపై కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జెట్ స్పీడ్‌లో కొనసాగుతుందని మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. ఆదివారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రచార సమన్వయం కోసం కమిటీలు వేశామని అందులో భాగంగా పిసిసి, ఏఐసిసి ఆదేశాలతో ప్రచారం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ 80 సీట్లతో అధికారంలోకి వస్తుందన్నారు. ఇక కొంతమంది తనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, అవే తన దీవెనలుగా భావిస్తానని ఆమె చెప్పారు.