Saturday, November 23, 2024

రాజస్థాన్ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఐక్యతా రాగం వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఉప్పు,నిప్పులా ఉండిన సిఎం అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌లు ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎంఎల్‌ఎలు నిర్ణయించిన వారే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని సచిన్‌పైలట్ తాజాగా వ్యాఖ్యానించారు. ‘ ఎన్నికల్లో కాంగ్రెస్ దృష్టి అంతా గెలుపుపైనే ఉంటుంది. మేము మా లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించం. గెలిచాక నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలో హైకమాండ్‌కు తెలుసు. పార్టీలో ఏవైనా సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకుంటాం. అది మా సంప్రదాయం, విధానం, చరిత్ర. నాయకత్వ బాధ్యతల విషయంలో ఎంఎల్‌ఎల అభిప్రాయం తప్పకుండా ఉంటుంది. 2018 ఎన్నికల్లో గెలిచిన స్థాయిలోనే ఈ సారి కూడా విజయం సాధిస్తాం. కానీ మెజారిటీ సాధించడంపై దృష్టిపెట్టాం.

ప్రపంచకప్ ఫైనల్లో బారత్ విజయం సాధిస్తుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాజస్థాన్‌లో విజయం సాధిస్తుంది’ అని పైలట్ ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గంనుంచి పైలట్‌రంగంలోకి దిగారు. ఆయన ప్రస్తుతం ఆ నియోజకవర్గంనుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిజెపి అభ్యర్థిగా మాజీ ఎంఎల్‌ఎ అజిత్ సింగ్ మెహతా బరిలో ఉన్నారు. ఈ నెల 25న రాజస్థాన్‌లో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్లు లెక్కింపు జరుగుతుంది. తన సొంత నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా సచిన్ పైలట్ ఆదివారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపితో హోరాహోరీ పోరు నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీ కొంపముంచుతాయేమోనని భయపడుతున్న వేళ సచిన్ పైలట్ ఐక్యతారాగం పఠించడం పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్లయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News