తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో యువ నాయకులతో పాటు రాజకీయ కురువృద్ధులు సైతం బరిలో దిగుతున్నారు. అందులో 70 నుంచి 79 ఏళ్ల వయసున్న కురు వృద్ధులు ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఈ ఎన్నికల బరిలో కొత్తవారితో పాటు దశాబ్దాల అనుభవం ఉన్న కురువృద్ధులు తలపడుతున్నారు. ఇప్పటికే పలు పదవుల్లో సేవలందించిన సీనియర్ నేతలు ఈసారి ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యర్థులు యువకులైనా తమ బలమేంటో చూపిస్తామంటూ బరిలో నిల్చున్నారు. అయితే పలు పార్టీల్లో యువ నేతలున్నప్పటికీ వారిపై ఉన్న నమ్మకంతోనో లేదా ఇదే చివరి అవకాశమనో ఆ రాజకీయ కురువృద్ధులకే ఛాన్స్ ఇచ్చాయి.
ఆయా ప్రాంతాల్లో తమకున్న కేడర్, రాజకీయ అనుభవం, తాము చేసిన అభివృద్ధే తమ విజయానికి తోడ్పడతాయని ఈ కురువృలు భావిస్తున్నారు. ఈ కురువృద్ధుల్లో 70 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వరకు వయసున్న నేతలు ఉన్నారు. ఇందులో నలుగురు బిఆర్‌ఎస్ నేతలు ఉండగా ఒక బిజెపి నేత, ఓ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వర రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మల్లారెడ్డి కూడా ఈ లిస్టులో ఉన్నారు. అయితే 79 ఏళ్ల వయసుతో వనమా వెంకటేశ్వర రావు అందరికంటే పెద్ద వ్యక్తిగా బరిలో ఉన్నారు. వనమా వెంకటేశ్వరరావు 79 ఏళ్ల వయసులో బిఆర్‌ఎస్ నుంచి కొత్తగూడెం అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వనమా ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి తన కొడుకు రాఘవను బరిలోకి దించుతారని అంతా భావించినా అతని మీద ఉన్న కేసులు, ఆరోపణల కారణంగా అధిష్టానం టికెట్ ఇచ్చేందుకు సుముఖత చూపించలేదు. దీంతో మరోసారి వనమాకే అవకాశం ఇచ్చింది.
74 ఏళ్ల వయస్సున్న పోచారం 6 సార్లు ఎమ్మెల్యేగా…
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వయసు 74 ఏళ్లు. బాన్సువాడ నుంచి ఏకంగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం 3 సార్లు మంత్రిగా కూడా చేశారు. 2019 నుంచి స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే పోచారం కూడా ఈసారి తన వారసుడిని బరిలోకి దించాలని భావించినా కెసిఆర్ మాత్రం పోచారం వైపే మొగ్గు చూపారు. దీంతో పోచారం మరోసారి బాన్సువాడ నుంచే పోటీకి దిగుతున్నారు. ఇక గులాబీ పార్టీలో మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వయసు 74 ఏళ్లు. 2014లో బిఎస్పీ తరుపున గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి ఆ తరువాత బిఆర్‌ఎస్‌లో చేరారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రి పదవి చేపట్టి సేవలందించారు. ఇక ప్రస్తుతం ఆయన బిఆర్‌ఎస్ నుంచి నిర్మల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మంత్రి మల్లారెడ్డికి 70 ఏళ్లు…
ఇక మంత్రి మల్లారెడ్డి 70 ఏళ్ల వయసులో మరోసారి బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి అంటే తెలియని వారుండరు. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన ఏకైక ఎంపి మల్లారెడ్డి. అయితే 2016లో బిఆర్‌ఎస్‌లో చేరిన మల్లారెడ్డి 2018లో మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు. ఇక ఇప్పుడు మేడ్చల్ నుంచి బరిలో నిలుస్తున్నారు.
మర్రి శశిధర్ రెడ్డికి 74 ఏళ్లు…
మాజీ సిఎం మర్రి చెన్నారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ తరపున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 74 ఏళ్ల వయసున్న శశిధర్ రెడ్డి కొంతకాలం క్రితం బిజెపిలో చేరారు. అయితే ఆయన వయసురీత్యా ఈసారి తన కుమారుడిని బరిలో దించుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఈసారి కూడా శశిధర్ రెడ్డి సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు.
రాంరెడ్డి దామోదర్ రెడ్డికి 71 ఏళ్లు…
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 71 ఏళ్ల వయసున్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి బరిలో దిగుతున్నారు. దామోదర్ రెడ్డి గతంలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఏకంగా 5 సార్లు గెలిచారు. 2 సార్లు మంత్రి అయ్యారు. దామోదర్ రెడ్డి తన కుమారుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకు వచ్చినా తానే పోటీలో దిగుతున్నారు. అయితే సూర్యాపేట టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం మాత్రం దామోదర్ రెడ్డికే టికెట్ ఇవ్వటం గమనార్హం.