Saturday, November 23, 2024

ప్రపంచ క్రికెట్‌పై కంగారూల ముద్ర.. ఎదురులేని శక్తిగా ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచకప్ క్రికెట్‌లో తనకు ఎదురులేదనే విషయాన్ని ఆస్ట్రేలియా మరోసారి చాటింది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను మట్టికరిపించి తన ఖాతాలో ఆరో వన్డే ట్రోఫీని జత చేసుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్లో మాత్రం చతికిల పడింది. ఆస్ట్రేలియాకు కనీస పోటీని కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఇక లీగ్ దశలో టీమిండియా చేతిలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా తుది సమరంలో మాత్రం అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. ఆరంభం నుంచే భారత్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

ఇదే సమయంలో లీగ్ దశలో టీమిండియా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం సయితం తీర్చుకుంది. సొంత గడ్డపై జరిగిన వరల్డ్‌కప్‌లో ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలనే భారత ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లింది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో ఆస్ట్రేలియా మళ్లీ కోలుకుంటుందా అనిపించింది. కానీ కంగారూలు మాత్రం తమ మార్క్ ఆటతో ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకుంటూ లక్షం దిశగా అడుగులు వేశారు. కీలక ఆటగాళ్లు గాయం బారిన పడినా ఆస్ట్రేలియా ఒత్తిడికి గురి కాలేదు. భారత్, సౌతాఫ్రికా చేతుల్లో ఓటమి ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.

ఆ తర్వాత ఆడిన మ్యాచుల్లో వరుస విజయాలను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లతో జరిగిన మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. వరుసగా ఏడు మ్యాచుల్లో గెలిచి ప్రపంచకప్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా దూకుడును ప్రదర్శించింది. సౌతాఫ్రికాతో గట్టి పోటీ ఎదురైనా చివరి వరకు అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. ట్రావిస్ హెడ్, స్టార్క్, కమిన్స్‌లు చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను ఫైనల్‌కు చేర్చారు. ఇక భారత్‌తో జరిగిన ఫైనల్లోనూ ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త భయపెట్టినా కంగారూలు ఒత్తిడికి గురికాలేదు.

కీలక సమయంలో రోహిత్, శుభ్‌మన్, శ్రేయస్‌లను వెనక్కి పంపి మళ్లీ పైచేయి సాధించారు. ఫామ్‌లో ఉన్న విరాట్, రాహుల్‌లను కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. లీగ్ మ్యాచుల్లో భారీ స్కోర్లతో చెలరేగిపోయిన భారత్‌ను ఫైనల్లో తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. తుది పోరులో టీమిండియా 240 పరుగులకే పరిమితమైంది. దీన్ని బట్టి ఆస్ట్రేలియా బౌలర్లు ఏ స్థాయిలో రాణించారో ఊహించుకోవచ్చు. లక్షఛేదనలో కూడా ఆస్ట్రేలియా అద్భుతంగా రాణించింది. ఆరంభంలో కాస్త తడబడినా సమన్వయంతో ఆడుతూ ముందుకు సాగింది. ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ చారిత్రక ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు.

అందనతం ఎత్తులో..
ఇక వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం మరోసారి రుజువైంది. వరల్డ్‌కప్‌లో 8సార్లు ఫైనల్‌కు చేరిన కంగారూలు ఏకంగా ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచారు. భారత్‌లో జరిగిన ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఆరో ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత్, వెస్టిండీస్‌లు రెండేసి ట్రోఫీలు గెలుచుకున్నాయి. అయితే ఈ జట్లతో పోల్చితే ఆస్ట్రేలియా నాలుగు ట్రోఫీలను అధికంగా సాధించింది.

ఈ టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అసాధారణ ఆటతో ఛాంపియన్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా సాధించిన ఆరు ట్రోఫీల రికార్డును ఇప్పట్లో సాధించడం ఇతర జట్లకు చాలా కష్టమనే చెప్పాలి. ఈసారి భారత్ ట్రోఫీని సాధిస్తుందని భావించినా ఆస్ట్రేలియా అసాధారణ ఆటతో ఆ అంచనాలను తారుమారు చేసింది. ఈ విజయం ఆస్ట్రేలియాకు మళ్లీ పూర్వవైభవం సాధించి పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News