చెన్నై : శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహాత, ప్రఖ్యాత విట్రియో రెటైనల్ సర్జన్ డాక్టర్ ఎస్‌ఎస్ బద్రీనాథ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. చెన్నెలో 1940 ఫిబ్రవరి 24న జన్మించిన ఆయన భార్య ప్రముఖ పిల్లల వైద్యురాలు.
ఇద్దరు కుమారులు అనంత్, శేషు. దేశం లోనే అత్యుత్తమ కంటివైద్యులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. విదేశాల్లో విద్యనభ్యసించిన బద్రీనాథ్ అనేక పరిశోధనలు చేసి భారత్‌కు వచ్చిన తరువాత చెన్నైలో 1978 లో శంకర నేత్రాలయ పేరుతో దేశం లోనే అతిపెద్ద స్వచ్ఛంద నేత్ర వైద్యశాలను నెలకొల్పారు. అనేక వేల మందికి కంటి చూపు రప్పించ గలిగారు. వైద్యరంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి 1996లో ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు.
ప్రధాని మోడీ తీవ్ర సంతాపం
బద్రీనాథ్ మృతికి ప్రధాని మోడీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. కంటి శస్త్రచికిత్సల్లో ఆయన చేసిన నిర్విరామ సేవ, సమాజానికి కొన్ని తరాల పాటు స్ఫూర్తి కలిగిస్తుందని నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, ఎఐడిఎంకె ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి బద్రీనాధ్‌కు నివాళులు అర్పించారు.