వరుస ఓటములతో బేజారు, పార్టీ మనుగడకు ప్రశ్నార్థకంగా ఎన్నికలు
ఆంథోల్, నారాయణఖేడ్, పటాన్‌చెరులో అమీ తుమీ
సంగారెడ్డి జిల్లాలో ఆంథోల్, నారాయణఖేడ్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఆంథోల్‌లో మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ ఈసారి చావో.. రేవో అన్నట్టుగా తలపడుతున్నారు. 2014 ఎన్నికల్లో ఆఖరి నిమిషయంలో బిఆర్‌ఎస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి బాబూమోహన్ చేతిలో అనూహ్యంగా ఓడి పోవడాన్ని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణా నుంచి పెద్ద పోస్టులో ఉండి కూడా ఓడిపోయిన తీరు విస్మయం కలిగించింది. ఇక గత ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ ధీమాతో ఉండగా, కొత్తగా వచ్చిన క్రాంతికిరణ్ చేతిలో మరో సారి ఓటమి పాలయ్యారు.ఈ ఓటమితో చాలా రోజుల వరకు రాజనర్సింహ రాజకీయాలు మాట్లాడ లేదు. ఇక ఈ సారి తనకు చివరి అవకాశంగా ఆయన చెబుతున్నారు.పాత ప్రత్యర్థి క్రాంతికిరణ్‌తో తలపడుతూ….సర్వ శక్తులొడ్డుతున్నారు. ఈ సారి అటు ఇటు అయితే…రాజనర్సింహ రాజకీయ జీవితం ఇక ప్రశ్నార్థకమే! దీంతో ఆంథోల్‌లో ప్రచార జోరు కూడా హోరెత్తుతున్నది.కనీసం పక్క నియోజకవర్గంలోని పక్క మండలానికి కూడా వెళ్లకుండా తన నియోజకవర్గంలోనే రాజనర్సింహ తిరుగుతున్నారు. మరో వైపు తన కూతురు త్రిశాలతో కూడా ఇంటింటి ప్రచారం చేయిస్తున్నారు.
నారాయణఖేడ్‌లో కూడా వరుస ఓటములు కాంగ్రెస్ ను బాగా కుంగ తీశాయి. 2014 ఎన్నికల్లో గెలిచిన సీనియర్ నేత కిష్టారెడ్డి అనరోగ్యంతో చనిపోగా, ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సత్తాచాటింది.ఆయన కుమారుడు సంజీవరెడ్డికి సానుభూతి కూడా కలిసి రాలేదు.అనంతరం 2018 ఎన్నికల్లో మరో సారి బిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి విజయకేతనం ఎగుర వేశారు.నాడు మాజీ ఎంపి సురేష్ షెట్కార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, దారుణ పరాజయాన్ని చవి చూశారు. కిష్టారెడ్డి తనయుడు డాక్టర్ సంజీవరెడ్డి బిజెపిలో చేరి, గణనీయ ఓట్లను సాధించారే తప్ప ఓడి పోక తప్పలేదు. ఈ సారి టిక్కెట్ షెట్కార్‌కు లభించినా, సంజీవరెడ్డికి బిఫామ్ ఇచ్చి సపోర్టు చేస్తున్నారు.
ఇక్కడి కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు ఏకం కావడంతో ప్రచారం బలంగా సాగుతోంది. బిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఇప్పటికే ఒక దఫా పూర్తి చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి వారం రోజుల క్రితం ప్రచారం ప్రారంభించారు. వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఈ సారి కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆఖరి నిమిషంలో అభ్యర్థిని ఖరారు చేయడం, క్షేత్ర స్థాయిలో ఇంకా గ్రూపుల మధ్య సమన్వయం లేకపోవడం, అధికార బిఆర్‌ఎస్ అభివృద్ది పనులు, ప్రతి ఇంటికి అందిన సంక్షేమ ఫలాలు కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారాయి.
పటాన్‌చెరులో మూడో సారి సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని ఎదుర్కోవడం విపక్ష కాంగ్రెస్‌కు శక్తికి మించిన పనిగా మారింది.గత రెండు ఎన్నికల్లో ఈజీగా గెలిచిన మహిపాల్‌రెడ్డి ఈ సారి మరింత బలంగా తయారయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్‌కు ఆఖరి నిమిషంలో టిక్కెట్ ఖరారు కావడం, ఇప్పుడిప్పుడే ప్రచారం ప్రారంభించడం, దీంతో బిఆర్‌ఎస్ స్పీడును అందుకోలేకపోతున్నారు.
ఇక్కడ నీలం మధుకు పార్టీ టిక్కెట్ ప్రకటించి వాపస్ తీసుకోవడం కూడా కాంగ్రెస్‌కు కొంత మైనస్‌గా మారింది. మినీ ఇండియాగా చెబుతున్న ఈ సెగ్మెంట్‌లో బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, బిఎస్‌పి నుంచి నీలం మధు బరిలో ఉన్నారు. వీరి వల్ల ఎవరికి నష్టమో ప్రస్తుతానికి అంచనాకు అందడం లేదు. కాంగ్రెస్‌కు ఈ సారి గెలవకపోతే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పార్టీ వ్యూహ కర్తలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక ,వైద్య శాఖా మంత్రి హరీష్‌రావు ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్‌కు ఛాన్స్ రాకుండా వ్యూహ రచన చేస్తున్నారు.
(బండారు యాదగిరి/సంగారెడ్డి బ్యూరో)