Monday, December 23, 2024

వామపక్షాల ‘ఉనికి’ పాట్లు!

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక రాష్ట్రంలో దీనస్థితిలో లెఫ్ట్ పార్టీలు,  2023లో ఖాతా తెరుస్తారా? డకౌట్ అవుతారా?

కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ, సిపిఎం ఎన్నికల రాజకీయాల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న దీన స్థితిలో ఉన్నాయి. ఈ సారైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచేనా? అన్న సందేహం పలువురి నుంచి వ్యక్తమవుతోంది. తెలంగాణ గడ్డపై కమ్యూనిస్టుల ప్రాభవం ఒకప్పుడు అంతా ఇంతా కాదు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుండి నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఎర్రజెండా పాత్ర మరువలేనిది. అలాంటిది నేడు వామపక్షాలు తమ ఉనికి కోసం కొట్లాడే పరిస్థితి ఉత్పన్నమైంది. ఎన్నికల రాజకీయాల్లో కనాడు కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తే ఎక్కువ సీట్లు గెలుస్తామనుకునే పార్టీలు నేడు కమ్యూనిస్టులకు ఏదో ఒక సీటు ఇస్తాం, మాతో కలిస్తే కలవండి లేదంటే మీ ఇష్టం అన్న పరిస్థితికి ఎర్రజెండా పార్టీలు దిగజారాయి. తొలి సార్వత్రిక ఎన్నికలు దేశంలో 1952లో జరిగాయి.

ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నిజాం ఏలుబడిలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది. ఇక అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఆంధ్ర ప్రాంతం ఉంది. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేసి 41 స్థానాల్లో గెలిచారు. తెలంగాణలో చిన్న చిన్న పార్టీలన్నింటిని కలుపుకుని డెమెక్రటిక్ ఫ్రంట్ పేరుతో కమ్యూనిస్టు పార్టీ బరిలోకి దిగి 37 స్థానాల్లో గెలుపొందింది. 1962 లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయి సిపిఐ, సిపిఎం పార్టీలుగా రూపాంతరం చెందాయి. అప్పటి నుంచి ఆ రెండు పార్టీలు తమ ప్రాభవాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఆ తర్వాత ప్రతీ ఎన్నికల్లో వారి ఓటింగ్ శాతం, సీట్లు తగ్గిపోయాయి.

ప్రత్యేక రాష్ట్రంలో కమ్యూనిస్టుల దీనస్థితి…
ఇక తెలంగాణ ఏర్పడే నాటి పరిస్థితులను గమనిస్తే 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి. ఇందులో అప్పటికే తెలంగాణ చాంపియన్ గా టిఆర్‌ఎస్, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ బరిలో ఉంటే, టిడిపి, వైఎస్సార్‌సిపి, బిజెపి, ఎంఐఎంలతో పాటు సిపిఐ, సిపిఎం పార్టీలు ప్రధాన పార్టీలుగా పోటీ పడ్డాయి.

టిఆర్‌ఎస్ ఆ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎంలు కేవలం చెరో స్థానాన్ని మాత్రమే దక్కించుకున్నాయి. ఎస్‌టి నియోజకవర్గాలైన భద్రాచలం నుండి సిపిఎంఒ తరపున సున్నం రాజయ్య, సిపిఐ పార్టీ తరపున పోటీ చేసి దేవరకొండ నియోజకవర్గం నుండి రవీంద్రనాయక్ మాత్రమే గెలుపొందారు. ఆ ఎన్నికల్లో సిపిఐ 38 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఇక సిపిఎం 68 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటులో మాత్రమే గెలిచింది.

సిపిఐకి 2014లో 2.54,859 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే మొత్తం ఓట్లలో సిపిఐ సాధించిన ఓటింగ్ శాతం కేవలం 0.53 శాతం మాత్రమే. 2009 ఎన్నికలతో పోల్చితే సిపిఐ ఓటింగ్ 0.69 శాతం తగ్గింది. ఇక సిపిఎం విషయానికి వస్తే మొత్తం 4,07,376 ఓట్లను సాధించగా ఓటింగ్ శాతం 0.84 మాత్రమే. 2009 ఎన్నికలతో పోల్చితే సిపిఎం సైతం 0.59 శాతం ఓట్లను కోల్పోయింది. ఇక సిపిఐ, సిపిఎం పార్టీలతో పోల్చితే తెలంగాణలోని ప్రాతినిధ్యం లేని బిఎస్‌పి పార్టీ నుంచి ఇద్దరు, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలవడం విశేషంగా పేర్కొనవచ్చు.

క్షీణదశకు చేరుకున్న వామపక్షాలు…
2018 ఎన్నికలకు వస్తే ఆ ఎన్నికల్లోను రెండు ఎర్రజెండా పార్టీలు మరింత క్షీణ దశకు చెరుకున్నట్లు ఓటింగ్ శాతం చెబుతోంది. ఈ ఎన్నికల్లో సిపిఐ మూడు స్థానాల్లోనే పోటీకి దిగింది. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. సిపిఎం 26 స్థానాల్లో బరిలోకి దిగి ఒక్క సీటు గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో సిపిఐ కేవలం 83,215 ఓట్లు మాత్రమే సాధిస్తే, సిపిఎం 91,099 ఓట్లు మాత్ర మే సాధించింది. 2014 ఎన్నికల్లో సిపిఐ 0.53 శాతం ఓట్లు సాధించగలిగితే 2018 ఎన్నికల్లో 0.40 శాతం ఓట్లు మాత్రమే సాదించింది. 0.13 శాతం ఓట్లను కోల్పోయింది. ఇక సిపిఎం 2014 ఎన్నికల్లో 0.84 శాతం ఓట్లను సాధిస్తే, 2018 వచ్చే నాటికి ఆ పార్టీ సాధించిన ఓటింగ్ శాతం 0.44 శాతం మాత్రమే. సిపిఎం 0. 4శాతం ఓట్లను కోల్పోయింది.

కాంగ్రెస్‌తో పొత్తులో ఒక్క సీటు…
2023 ఎన్నికల్లో సిపిఐ ఒక్క స్థానంలోనే బరిలోకి దిగింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సిపిఐ పార్టీ, కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును బరిలోకి దింపింది. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎంఎల్‌ఎ జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. అయితే సిపిఐ పార్టీ గెలుపు కూడా అంత సులువుగా లేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఓటింగ్ అంతా సిపిఐకి షేర్ అవుతందా? లేదా? అన్న ఆందోళన ఎర్రజెండా పార్టీ నేతల్లో నెలకొంది. మరో వైపు బరిలో దిగిన జలగం వెంకట్రావు బిఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చుతే అది సిపిఐకి నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి సిపిఐ గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకలా మాత్రం లేదు.

ఇక సిపిఎం పార్టీ ఒంటరిగానే ఈ ఎన్నికల్లోనూ బరిలోకి దిగింది. మునుగోడులో చేసిన సాయానికి బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని భావించినా కాంగ్రెస్‌తో కలిసి పోటీలో దిగుదామనుకున్నా అదీ కుదరక చివరకు ఈఎన్నికల్లో ఒంటరిగానే బరిలో నిలిచింది. తెలంగాణలో 17 స్థానాల్లో సిపిఎం తన అభ్యర్థులను నిలబెట్టింది. పాలేరులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వయంగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇక ఈ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు ఎన్నికల్లో నిలబడటంతో ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో ఇద్దరు వామపక్ష పార్టీ సారథులు గెలిచి అసెంబ్లీలో కాలుపెడతారా లేక 2018 ఎన్నికల మాదిరి వామపక్ష పార్టీలు డకౌట్ అవుతాయా అన్నది చూడాలి.

(హరి మోహన్/మన తెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News