ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాపై ఆయన భార్య నవాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త తనను శారీరికంగా హింసించేవాడనీ, తనను, కూతుళ్లను ఆయన ఇటీవల దారుణంగా కొట్టాడనీ ఆమె ఆరోపించారు. గౌతమ్, నవాజ్ దంపతులు విడాకులకోసం పిటిషన్ పైల్ చేసిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 10 ఉదయం తనపైనా, తన మైనర్ కుమార్తెపైనా గౌతమ్ దాడి చేసి కొట్టాడని, ఆ సమయంలో తన కుమార్తెల స్నేహితులు కూడా అక్కడే ఉన్నారని నవాజ్ చెప్పారు. గౌతమ్ పావుగంట సేపు తమపై దాడి చేసి కొట్టి, అకస్మాత్తుగా అక్కడినుంచి వెళ్లిపోయాడనీ, దాంతో ఆయన గన్ తీసుకువస్తారేమోననే భయంతో నా చిన్న కూతురును ఒక గదిలోపెట్టి తాళం వేశాననీ ఆమె తెలిపారు. పోలీసులు మా ఇంటికి రాకుండా గౌతమ్ మేనేజే చేశారని ఆమె వాపోయారు. అదే సమయంలో నీతా అంబానీ, అనంత్ అంబానీ ఫోన్ చేయడంతో వారికి తన పరిస్థితి వివరించాననీ, వారు కలగజేసుకుని పోలీసులను మా ఇంటికి పంపారనీ ఆమె చెప్పారు.
ఈ ఆరోపణలపై స్పందించేందుకు గౌతమ్ సింఘానియా నిరాకరించారు. తన కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోవడం లేదని ఆయన అన్నారు.
రేమాండ్ గ్రూప్ ఛైర్మన్ అయిన గౌతమ్ సింఘానియాకు 11వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయన ఫిట్ నెస్ ట్రైనర్ అయిన నవాజ్ మోడీని ప్రేమించి 1999 పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ ఎనిమిదేళ్లపాటు డేటింగ్ చేశారు. వీరికి నీహారిక, నీసా అనే కుమార్తెలు ఉన్నారు. అయితే తాను, నవాజ్ విడిపోతున్నట్లు ఆయన వారం రోజుల క్రితం చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. కాగా విడాకుల సెటిల్ మెంట్ లో భాగంగా నవాజ్… ఆస్తిలో 75 శాతాన్ని భరణంగా కోరినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.