భువనేశ్వర్ : ఒడిశా జాజ్‌పూర్ జిల్లా ఒరలి గ్రామం స్కూలులో విద్యార్థిచే టీచర్ గుంజీలు తీయించడం మరణానికి దారి తీసింది. పదేళ్ల విద్యార్థి రుద్రనారాయణ్ సేథీ నాలుగో తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తరగతులు జరుగుతుండగా 3 గంటల ప్రాంతంలో స్కూల్ ఆవరణలో తోటి నలుగురు విద్యార్థులతో కలసి రుద్ర ఆడుతున్నాడు. దీన్ని గమనించిన టీచర్ ఆ విద్యార్థులు నలుగురినీ గుంజీలు తీయాలని శిక్ష విధించారు. గుంజీలు తీస్తూ రుద్ర కుప్పకూలిపోయాడు.
ఈ సమాచారం ఒరలి గ్రామం సమీపాన ఉన్న తల్లిదండ్రులకు తెలిసింది. వారు వెంటనే ఆ బాలుడ్ని కమ్యూనిటీ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి చివరకు మంగళవారం రాత్రి కటక్ లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి బాలుడు చనిపోయినట్టు వెల్లడించారు. దీనిపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నీలాంబర్ మిశ్రాను సంప్రదించగా, ఇంతవరకు తనకెలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందగానే దర్యాప్తు చేపట్టి ఎవరైతే దోషులో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రసూల్‌పూర్ అసిస్టెంట్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రవంజన్ పతి ఆ స్కూలును సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు.