Monday, December 23, 2024

తగ్గేదే లే..

- Advertisement -
- Advertisement -

అభ్యర్థుల తరపున ఆత్మీయుల ప్రచారం

మనతెలంగాణ/ఆదిభట్ల : ఎన్నికల సమరాంగణంలో ప్రచార పర్వం ఊపందుకుంది. బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఎవరికి వారు తగ్గేదేలే అంటూ తమదైనశైలిలో దూసుకుపోతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బిఆర్‌ఎస్ బిజేపిలు తమ జోరుపెంచాయి. మేము సైతం అంటూ బిఎస్‌పి డిఎస్‌పి సిపిఎం శ్రేణులు కదనరంగంలో కదం తొక్కుతున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన ప్రచారరథాలు పల్లెల వైపు దూసుకుపోతున్నాయి. తమ అభ్యర్థుల గెలుపే లక్షంగా ఆయా పార్టీల కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. ఆత్మీయులు కుటుంభ సభ్యులు సైతం అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఇబ్రహీంపట్నంలో రోజురోజుకూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

పల్లెపల్లెనా ప్రచారం…
ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టమైన ప్రచారపర్వం జోరందుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజేపి, బిఎస్‌పి, డిఎస్‌పి, సిపిఎం పార్టీలకు చెందిన ప్రచార రథాలు పల్లెల్లో దూసుకుపోతున్నాయి.

దూకుడు పెంచిన అభ్యర్థులు…
అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపే లక్షంగా బరిలో నిలిచిన అభ్యర్థులు దూకుడు పెంచారు. పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులంతా ప్రజాక్షేత్రంలోనే గడుపుతున్నారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బిజేపి అభ్యర్థి నోముల దయానంద్‌గౌడ్‌లు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. మేము సైతం అంటూ బిఎస్‌పి, డిఎస్‌పి, సిపిఎం, టిసిపిఐ అభ్యర్థులు గొరిగె మల్లేష్, తులసిగారి రవీందర్, పగడాల యాదయ్య, కొంతం మాధవరెడ్డిలు కదనరంగంలో కదం తొక్కుతున్నారు. అలాగే బరిలో నిలిచిన పలువురు స్వతంత్య్ర అభ్యర్థులు సైతం తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

అభ్యర్థుల కోసం ఆత్మీయులు…
బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు, ఆప్తులు, ఆత్మీయులు సైతం ప్రచారం నిర్వహిస్తుండటం విశేషం. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తరపున ఆయన కోడలు, కుమార్తె ప్రచారం నిర్వహిస్తున్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డి తరపున ఆయన కుమార్తె, కోడలు రంగంలోకి దిగారు. అలాగే మరికొంత మంది అభ్యర్థులు సైతం వారి కుటుంభసభ్యులను ప్రచారంలోకి దింపనున్నట్లు సమాచారం.

ఆకట్టుకుంటున్న కళాబృందాలు…
ప్రచార రథాలే వేదికగా కళాబృందాలు నిర్వహిస్తున్న నృత్యప్రదర్శనలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. కళాకారులు తమ ఆటాపాటలతో అలరించే యత్నం చేస్తున్నారు. వినూత్నమైన బాణీలతో రూపొందించిన పాటలతో ప్రచార రథాలు పల్లెల్లో సందడిచేస్తున్నాయి.

వేడెక్కిన రాజకీయం..
ప్రచారహోరుతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎమ్మెల్యే పీఠం ఎవరికి దక్కనుందనే అంశంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యంపై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News