పిసిసి చీఫ్‌కు నీతి,రీతి లేదు.. చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదు
పార్టీ టికెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే అంటున్నారు ఆయనవన్నీ ఫాల్తు
మాటలే రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి ప్రజా ఆశీర్వాద సభల్లో రేవంత్‌పై
నిప్పులు చెరిగిన బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు
తెలంగాణ కోసం మనం కొట్లాడిననాడు రేవంత్ ఎక్కడుండు.. ఆంధ్రోళ్ల సంకల ఉండే.. తెలంగాణ ఉద్యమకారులమీదికి తుపాకీ పట్టుకొని బయలెళ్లిండు.. తుపాకీ రాముడిలెక్క. ఎవడ్రా నాకడ్డమొచ్చేది.. కాల్చిచంపేస్తానన్నడు. తెలంగాణ వచ్చింది.. మంచిగ నడుపుకుంటున్నం. ఏం చేసిండీ రేవంత్ రెడ్డి.. రాష్ట్రాన్ని అస్థిర పరచడానికి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను కొనడానికి 50 లక్షల నగదు ఇచ్చుకుంట దొరికిన దొంగ. మీరందరూ చూసిన్రు కద టీవీలల్ల. పోలీసోళ్లు పట్టుకపోయి జైళ్ల వేశిన్రు. చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు.. ఇట్ల నువ్ దొరికనవ్ కదనయా అంటే.. నాకది మెడల్ అంటడాయన.. అట్ల దొరుకుడే పతకమట! ఏం మాట్లాడాలి ఇగ. ఓడు వంకర పుట్టిండంట. ఎందుకు పుట్టినవ్రా వంకరంటే.. సక్కగునోడ్ని ఎక్కిరించడానికన్నడట.. ఇట్లున్నది రేవంత్ రెడ్డి యవ్వారం! ఇంతకన్నా ఘోరం ఉంటదా? 50 లక్షల తీసుకొని ఎంఎల్‌ఎలను కొనడానికి పోయి నిటారుగా దొరికిపోతివి. మళ్ల సత్యహరిశ్చంద్రుడి లెక్క మాట్లాడితే ఎట్ల..? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కొడంగల్‌లో వెలగబెడుతున్ననని కామారెడ్డిల నామీద పోటీకి వచ్చిండు. తుక్కుతుక్కుగా ఓడగొడతావున్నరు.. ఆడ అంగిపోయేదాక జంపుతున్నరు. ఈడ మీరు లాగుపోయేదాక జంపాలి.
– కొడంగల్‌లో కెసిఆర్
మన తెలంగాణ/కొడంగల్, తాండూరు, పరిగి, కోస్గీ, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రమాదకరమైన వ్యక్తి అని, భూ కబ్జాదారుడని, ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేస్తడు… అని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేగాక రేవంత్‌రెడ్డి ఒక పెద్ద దొంగ అని, బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి 50 లక్షల నగదుతో దొరికిపోయిన దొంగని సీఎం కెసిఆర్ బుధవారం కొడంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి గుణం ఏంటి..? టిక్కెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే అంటున్నారని కెసిఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమం జరిగిననాడు రేవంత్‌రెడ్డి ఆంద్రోళ్ళ సంకల ఉండే.., తెలంగాణ ఉద్యమకారుల మీదికి తుపాకీ పట్టుకొని బయల్దేరిండు… ఎవ్వరైనా అడ్డమొస్తే కాల్చేస్తా…అని బెదిరించిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని సీఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ వచ్చింది… మంచిగ నడుపుకుంటు న్నం, ఏం జేసిండు రేవంత్‌రెడ్డి… రాష్ట్రాన్ని అస్థిరపరడానికి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి నగదు 50లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ దొరికిపోయిన దొంగ రేవంత్‌రెడ్డి అని సీఎం కెసిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తిని పొట్టుపొట్టుగా ఓడించాలని ప్రజలను కోరారు. రేవంత్‌రెడ్డి ఆధ్వ ర్యంలో ఏమైనా పని జరిగిందా… ఇయ్యాల నరేందర్‌రెడ్డి వచ్చాక ఎంత పని జరిగింది… ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి… అనే అంశాలను ఆలోచించి నిజాయితీతో ఓటెయ్యాలని సిఎం కెసిఆర్ కోరారు. పనిచేసే నరేందర్‌రెడ్డి కావాల్నా… ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్‌రెడ్డి కావాల్నా… మీరే నిర్ణయించుకోవాలని సభికులను కెసిఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితడని మీరు ఓట్లేస్తే మోసపోతారని సీఎం కెసిఆర్ అన్నారు. నరేందర్‌రెడ్డిని గెలిపించండి, ఆయన స్థాయి కూడా పెరుగుతుందని అన్నారు. రేవంత్‌రెడ్డికి నీతి లేదు, పద్దతి లేదని, రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో ఉండదగిన మనిషి కాదని సీఎం కెసిఆర్ ధ్వజమెత్తారు. బస్‌డిపో, డిగ్రీ కాలేజీలు, దవాఖానాలు ఏడికెళ్ళి వచ్చాయో ఆలోచించాలని కోరారు.
మరోసారి బిఆర్‌ఎస్ గెలుపు ఖాయం : కెసిఆర్
తాండూరు : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణను ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీని గంగలో కలిపి బిఆర్‌ఎస్‌ను గెలుపించాలని కోరారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులోని విల్యామూన్ హైస్కూల్ మైదానంలో భారి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసిఆర్ ప్రసగించారు. రైతుల చల్లగా ఉంటేనే దేశం బాగుపడుతుందని, రైతులకు రైతు బంధు పుట్టించింది కేసిఆర్ ఒక్కరే అని అన్నారు. రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. రైతు బంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు దురాలోచనతో కుట్ర చేశారని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని గెలుపిస్తే ఎకరానికి రూ. 10 వేలు ఇచ్చేది డిసెంబరు 3 తరువాత ఎకరాకు 16 వేలు ఇస్తామని అన్నారు.
58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ హయంలో ఆంద్రుల పాలనలో తెలంగాణ గోస చూశామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో రోడ్లు వేసుకున్నామని, చెక్‌డ్యాంలు కట్టుకున్నామని, చెరువుల బాగుచేయించుకున్నామని అన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు 5గంటలు మాత్రమే కరెంటు ఇస్తుందని, తెలంగాణలో 24గంటలు కరెంటు సరఫరా చేస్తున్నామని అన్నారు. ఫైలెట్ రోహిత్‌రెడ్డి నిజాయితిపరుడని, ఇటీవల బిజేపి నాయకులు చేసిన కుట్రను భగ్నం చేసి వారిని జైలు పాలు చేయించారని వివరించారు. అందుకని రోహిత్‌రెడ్డి తాండూరు అభివృద్దికోసం అడిగిన నిధులను వెంటనే మంజూరు చేయించానని చెప్పారు. అదే విధంగా తెలంగాణలో 3500 గిరిజన తాండాలను పంచాయతీలుగా మార్చడం జరిగిందని అన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని కోరిన మేరకు అదే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. బంజారాల కోసం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భవనం నిర్మించడం జరిగిందన్నారు. తాండూరు విధంగా మైనార్టీ విద్యార్థుల కోసం మైనార్టీ హాస్టల్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. కేసిఆర్ బతుకున్నంత వరకు తెలంగాణ ప్రజలకోసమే పనిచేస్తానని అన్నారు. హిందూ, ముస్లింలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కలిసి మెలసి ఏకమైన బిఆర్‌ఎస్‌ని భారీ మెజార్టీతో గెలుపించాలని కోరారు.
రేవంత్ జైలు కెళ్లి చిప్పకూడు తినలేదా…
మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ దళారులు., పట్వారీలు, విఆర్‌ఓల రాజ్యం తెస్తామని అంటున్నరు.. దయ చేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం, నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మహబూబ్ నగర్ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ అభ్యర్ధి పట్నం నరేంద్ర రెడ్డిల విజయాన్ని కోరుతూ ఈ సభలో ప్రసంగించారు. మహబూబ్ నగర్ పట్టణం, జిల్లాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది.. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో నేను ఇక్కడి నుంచి ఎంపిగా పోటీ చేసినా మీరందురూ కూడా, ఈయనది ఏ వూరు ఎ పల్లి అని చూడకుండా తెలంగాణానేని భావించి పెద్ద మనస్సుతో నన్ను ఎంపిగా గెలిపించారు. నేను మహబూబ్ నగర్ ఎంపిగా ఉన్నప్పుడే తెలంగానా సిద్దించిందని కెసిఆర్ అన్నారు.
ఆ గౌరవం, ఆ కీర్తి తెలంగాణా చరిత్రలో మహబూబ్‌నగర్‌కు శాశ్వతంగా ఉంటుందన్నారు. మీరందరూ చైతన్య వంతులు, విద్యాదికులు చాలా మంది ఉన్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు ప్రజలకు మంచినీళ్లు, సాగునీరు ఇవ్వలే, చేనేతల కార్మికుల ఆకలి చావులు, రైతులు ఆత్మహత్యలు,. వలసల బతుకులుగా ఉండేవని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టుల ద్వారా నీళ్లిస్తే పన్నులు వేస్తాయని కాని మన రాష్ట్రంలో ఆ పన్నును రద్దు చేశామన్నారు. మోటార్లు, ట్రాన్స్ పార్మర్లు కాలకుండా 24 గంటలు ఫ్రీ కరెంటు ఇస్తున్నామన్నారు. రైతు బందు ఉండుడు కాదని, ఇక్కడ శ్రీనివాస్ గౌడ్‌ను గెలిపిస్తే ఎకరాకు రూ.16 వేలకు రైతు బందు పెంచుతామని కెసిఆర్ స్పష్టం చేశారు. యుద్దానికి వెళ్లే టప్పుడు కత్తి ఒకరికిచ్చి యుద్దం చేయమంటే చేస్తారా? ఎవరిని చేతికి కత్తి ఇవాలో కరెక్టుగా ఇవ్వాలని ఆయన ప్రజల్ని కోరారు.
రేవంత్ రెడ్డి సీసాలు ఇస్తాడు…
కోస్గి : కోస్గి సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఈనెల 30వ తేదీ వరకు సీసాలు ఇస్తడు.. తరవాత అవుతల పడతాడు.. 10 హెచ్‌పి మోటార్ ఎవరు పెట్టాలే.. అని నిలదీశారు. వ్యవసాయం ఉన్నవాడు ఎవరు మాట్లాడరు ఇట్లా.. నాకు కూడా వ్యవసాయం ఉంది. ఆ బాధలేందో నాకు తెలుసు రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా దున్నిండా? వ్యవసాయ ఉందా అని నిలదీశారు. రేవంత్ రెడ్డే పెద్ద బూకబ్జాదారుడు..ఎక్కడ బడితే ఆడ భూములను కబ్జా పెడతాడు..ఈ జిల్లాలో చాల పెట్టిండు. కాంగ్రెస్ అదికారంలోకి వస్తే ధరణిని బంగాల ఖాతంలో కలిపి భూ మాత పెడతారంటే. అది భూమాత కాదు భూమేత అయితని కెసిఆర్ ఎద్దేవ చేశారు. ముప్పై రోజులు మురిపించినోళ్లకు ఓటేస్తే చాలా దెబ్బతినే ప్రమాదమందుని అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కెసిఆర్ కోరారు.
రేవంత్‌రెడ్డి నోరు విప్పితే గబ్బు మాట్లాడుతారని అన్నారు. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకున్నాడని గాంధీభవన్‌పై కాంగ్రెస్ నాయకులు రాళ్లు రువ్వలేదా? అని నిలదీశారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి 50 లక్షలు ఇచ్చుకుంటూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని కెసిఆర్ ఘాటుగా విమర్శించారు. రేవంత్‌రెడ్డిని పోలీసులు పట్టుకెళ్లి జైల్లో వేసిన దృశ్యాలను టివిల్లో ప్రజలందరూ చూశారన్నారు. రేవంత్ రెడ్డికి సిప్ప కూడు తిన్నా సిగ్గు రాలేదని విమర్శించారు. ఇలా దొరికినవ్ కదయ్యా అంటే అది తనకు మెడల్ అంటున్నడు.. ఆయనకు పథకం అంటుండు. ఏమి మాట్లాడుతాం.. ఎందుకు పుట్టినవ్‌రా వంకర అంటే సక్కక ఉన్నోన్ని వెక్కిరించడానికి అన్నాడంటే రేవంత్ రెడ్డిలా రూ.50 లక్షలు తీసుకొని ఎమ్మెల్యేలను కొనాలని నిటారుగా దొరికి సత్య హరిచ్చంద్రుడిలా మాట్లాడితే ఎట్లా అని కెసిఆర్ నిలదీశారు. ప్రజలు ఆలోచించుకోవాలని కెసిఆర్ సూచించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు&మన్నకాడు. ఆ ఫాల్తు రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు, వాళ్లిచ్చే మందు సీసాలు, నోట్ల కట్టలకు ఆశపడి ఏ మాత్రం మోసపోవద్దని కెసిఆర్ కోరారు. రేవంత్‌రెడ్డికి ఒక నీతిగాని, పద్దతి కాని లేదు, నియమం లేదు.. ముఖ్యమంత్రిని పట్టుకొని పిండం పెడ్తానంటూ ఇష్టం వచ్చిన గబ్బు అంతా మాట్లాడతారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులేనా రాజకీయాల్లో ఉండాల్సింది. వీరేనా కోడంగల్ గౌరవాన్ని కాపాడాల్సిందని అన్నారు. ఇవాళ బిఆర్‌ఎస్ చేసిన అభివృద్దిని చూసి నిర్ణయం తీసుకోవాలని కెసిఆర్ కోరారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఇంత పొడవుందని, నా మీద కామారెడ్డికి పోటికి వచ్చిండు.. ఆడ వారు తుక్కు తుక్కు ఓడగొడతున్నరు.. ఆడ అంగిపోయేలా కొడుతున్నరు.. ఇక్కడ మీరు లాగు ఊడేలా కొట్టాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. కొడంగల్‌కు, ఈ రాష్ట్రానికి ఈ దరిద్రుల పీడ వదిలించుకోవాలి… వీరు రాజకీయాల్లో ఉండే వ్యక్తులు కాదని, ఒక నియమము, పద్దతి, ప్రజల పట్ల ప్రేమ వంటివి రాజకీయాల్లో ఉండాలి కాని, కేవలం భూకబ్జాలు పెట్టుడు, పొద్దును లేస్తే పైసల గురించి మాట్లాడుడు… ఇదేనా పద్దతి అని కెసిఆర్ నిలదీశారు.
పరిగిలో మహేశ్‌రెడ్డిని గెలిపిస్తే బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుంది
పరిగి : పరిగిలో ఎమ్మెల్యే అభ్యర్ధి మహేశ్‌రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపిస్తే రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ వస్తే సౌబాగ్యలక్ష్మీద్వారా ఇండ్లు కట్టిస్తామన్నారు, ఇంటి స్థలాలను ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. పరిగి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొప్పుల హారీశ్వర్‌రెడ్డితో కలిసి 30 ఏళ్లు పని చేశామని గుర్తు చేశారు. ఆయన లేని లోటుందన్నారు. అందుకు ఆయన కొడుకు నా కొడుకే అనుకోని భారీ మోజార్టీతో గెలిపించాలని సూచించారు. పరిగిలో డిగ్రి కళాశాల, నియోజకవర్గంలో నూతనంగా రెండు మండలాను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గండ్వీడ్, మహ్మాదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో కలపాలని, దోమ మండలం దాదాపూర్, పూడూరు మండలం కంకల్ మండలాలుగా కొత్తగా ఏర్పాటు చేయాలని కోరారని ఈ హామిలను అధికారంలోకి వచ్చిన నెల లోపు నేరవేరుస్తానని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ స్వర్గీయ హారీశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్ళి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొప్పుల గిరిజాదేవి, వారి కుటుంబ సభ్యులను పరమార్శించారు.