ఎన్నికల ప్రచారంలోకి బంధుగణం
కుటుంబ సమేతంగా తిరిగినా విజయం కష్టమే
వియ్యంకులు, అత్తగారి తరుఫున చుట్టాలు ప్రచారం
ఎన్నికల సమరం ప్రధాన పార్టీల మధ్య రసవత్తరంగా సాగుతోంది
స్వల్ప మెజార్టీతోనైనా విజయం సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తుండటంతో బరిలో నిలిచిన అభ్యర్థులు కుటుంబ సభ్యులతో పాటు బంధుగణ వర్గాన్ని కూడా ఎన్నికల క్షేత్రంలోకి దించుతున్నారు. ఈ పోరులో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతుండటంతో గెలుపుబావుటా ఎగుర వేసేందుకు తమకు వచ్చిన రాజకీయ విద్య ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకు కుటుంబ సభ్యులు బ్యాలెట్ పత్రాలు చేతపట్టి గ్రామాలు తిరిగి, ఈసారి తమకు మద్దతు ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. అయినా గెలుపు సులువుగా లేకపోవడంతో వియ్యంకులు, అత్తగారి తరుఫు బంధువులను రంగంలోకి దింపి నా నియోజకవర్గంలో మీకు పరిచయం ఉన్నవారంతా ఓటు వేసేలా చూడాలని కోరుతున్నారు. దీంతో బంధువులు గత రెండు రోజులుగా సొంత పనులు పక్కకు పెట్టి తమ నాయకుని గెలిపించుకునే బస్తీలు, గ్రామాల్లో శ్రమిస్తున్నారు.
గ్రేటర్ నగరంలో ఎల్బీనగర్ లో సుధీర్‌రెడ్డి, మహేశ్వరంలో శ్రీరాములు యాదవ్, అంబర్‌పేట్ లో కాలేరు వెంకటేష్, మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు, ఖైరతాబాద్‌లో విజయారెడ్డి, శేరిలింగంపల్లిలో జగదీశ్వర్‌గౌడ్, కూకట్‌పల్లిలో మాదవరం కృష్ణరావు అభ్యర్ధులు బంధువులను ప్రచారం చేయిస్తూ ప్రలోభాలు పెట్టే పంపకాలు కూడా వారికే అప్పగిస్తున్నట్లు విపక్ష పార్టీల అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డి, అల వెంకటేశ్వరరెడ్డి, నల్లగొండ జిల్లాలో రవీంద్ర నాయక్, బాలునాయక్, గాదరి కిశోర్, మందుల సామేల్ , పైళ్ల శేఖర్‌రెడ్డి , కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, గొంగిడి సునీత, బీర్ల ఐలయ్యలు బంధుగణాన్ని ఓటర్ల వద్దకు పంపి గెలిస్తే చేపట్టే అభివృద్దిని వివరిస్తున్నారు.
మెదక్ జిల్లాలో సునీతా లక్ష్మా రెడ్డి, రఘనందన్ రావు, జగ్గా రెడ్డి, దామోదర రాజనర్సింహ, నిజామాబాద్‌లో జీవన్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, రవీందర్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, దర్మపురి అరవింద్, వికాస్‌రావు, కొప్పుల ఈశ్వర్ బంధువులతో ప్రచారం చేయిస్తూ ఓట్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రాథోడ్ బాపురావు, రేఖ నాయక్, ఖమ్మంలో పొడెం వీరయ్య, సండ్ర వెంకట వీరయ్య, వరంగల్ జిల్లాలో చల్లా దర్మా రెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం బంధువులు సహకరించాలని కోరుతూ ప్రచారంలో ముందుండాలని వేడుకుంటున్నారు. ఈ ఎన్నికలను బంధుగణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఓటర్లను క్షేమ పలకరింపులతో ఆకట్టుకుంటోంది. మీ బాధ్యత మాది అంటూ, వారే ఓటర్లకు హామీలిచ్చేస్తున్నారు. పార్టీ శ్రేణులూ వారి కుటుంబ సభ్యుల్ని ఓటర్ల దగ్గరకు పంపుతున్నారు. తమ అభ్యర్థి గెలుపుతో తమకూ భవిష్యత్తులో రాజకీయ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంటున్నారు.