ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్
రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సులకు త్రివిధ దళాలకు వర్తిస్తున్న అన్ని సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ఎక్స్ సెంట్రల్ ఆఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీస్‌మెన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేసింది. గురువారం అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నికలు దేశంలోనే మొదటి సారిగా బ్యాలెట్ పద్దతిలో జరిగాయి. ఈ అసోసియేషన్‌లో సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్, బిఎస్‌ఎఫ్, రైటిబిపి, ఎస్‌ఎస్‌బి, అస్సాం రైఫిల్స్ కు చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్ ఉన్నారు. ఈ ఎన్నికలు ఎల్‌బి నగర్‌లోని రాష్ట కార్యాలయంలో జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్స్ క్యాప్ఫ్ సభ్యులు పాల్గొని తమ ఓట్ హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా భగవంతు (ఎక్స్ అసిస్టెంట్ కమాండెంట్ క్యాప్ఫ్ ) విధులు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కె. శ్యామ్ సుందర్ రెడ్డి (ఎక్స్ సిఐఎస్‌ఎఫ్) అధ్యక్షులుగా, మామిళ్ళ రాజు (ఎక్స్ సిఆర్‌పిఎఫ్) ప్రధాన కార్యదర్శిగా, ఎమ్. వెంకట్ రెడ్డి (ఎక్స్ బిఎస్‌ఎఫ్) కోశాధికారిగా, ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వి.శ్రీనివాస్ రెడ్డి, లవకుశ రెడ్డి, డి. విజేందర్, ఎన్‌ఎన్ రెడ్డి లను ఎన్నుకున్నారు. చీఫ్ అడ్వైసర్, ఇతర ఎక్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ లకు కూడా త్రివిధ దళాలకు వర్తిస్తున్న అన్ని సదుపాయాలను కల్పించాలని, 2004 లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని విమర్శించారు. చైనా, బర్మా బార్డర్ లో అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఐటిబిపి, పాకిస్థాన్, బంగ్లాదేష్ బార్డర్ లో బిఎస్‌ఎఫ్, టెర్రరిస్ట్ లను ఎరి వేయడంలో ఇఆర్‌పిఎఫ్ తమ ప్రాణాలను పణంగా పెట్టి పదవి విరమణ చేశారని వారికి ఇప్పటికీ అందవలసిన సౌకర్యాలు అందకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వాలు వారికి రావాల్సిన సౌకర్యాలు కల్పించాలని కోరారు.