(ఎం.భుజేందర్/మనతెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈనెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ముగియగా, నియోజకవర్గాల్లో అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ఎప్పటికప్పుడు నూతన మార్గాలు అన్వేషిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి నిర్వహించే ఎన్నికల ప్రచారం నూతన ఒరవడులను అందిపుచ్చుకుంటుంది.
రాజకీయ పార్టీలు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కుస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారాల్లో భాగంగా సాధారణంగా పట్టణాలు, మండలాలు, గ్రామాలలో ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ఫ్లెక్సీలు పెడుతుంటారు. ఈసారి ఎక్కువగా కటౌట్లు, ఫ్లెక్సీలకు బదులుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా మార్కెట్లోకి నూతనంగా ఎల్‌ఇడి స్క్రీన్లు అందుబాటులోకి వచ్చాయి. చీకట్లోనూ ఈ స్క్రీన్లపై ఉండే బొమ్మలు, రాతలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటికి 2 గంటల పాటు ఛార్జింగ్ పెడితే.. 5 గంటల వరకు పని చేస్తాయని చెబుతున్నారు. వీటిపై దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు.
సోషల్ మీడియాలో ఖర్చు తక్కువ.. ప్రచారం ఎక్కువ…
ఎన్నికల ప్రచారంలో కొత్త పోకడ మొదలైంది. ప్రత్యర్థులను డామినేట్ చేసేందుకు నాయకులు సోషల్ మీడియాను ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నా రు. నిత్యం ప్రజలతో మమేకం అయ్యేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వేదికగా కొత్త ప్యాకేజీలకు తెరలేపారు. ఖర్చు తక్కువ, ప్రచారం ఎక్కువ కావడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్‌ఫోన్ ఉండటం సర్వసాధారమైపోయింది. లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్ చూసే వారు లక్షల్లో ఉండడంతో నాయకులు ప్రచారానికి ఇదే సరైన మార్గమని అనుకుంటున్నారు. చేసిన పనిని.. చేయబోయే పనులను.. తమ ప్రచార కార్యక్రమాలను పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
క్యాంపెనర్లుగా సోషల్ మీడియా సెలబ్రిటీలు…
ప్రచార అవసరానికి తమ ప్రధాన ఆయుధం సోషల్ మీడియా అని చాలామంది నేతలు నమ్ముతున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా సెలబ్రిటీలను తమ ప్రచార క్యాంపెనర్లుగా వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లే విధానాలను వారితో మరింత చర్చించి ముందుకు వెళుతున్నారు. ప్రచార శైలి భిన్నంగా ఉండేలా అనుభవజ్ఞులతో స్క్రిప్ట్ రాయించుకుని అందుకు అనుగుణంగా వీడియోలు రూపొంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం పలువురు యూట్యూబ్ స్టార్లు, స్క్రిప్ట్ రైటర్లకు డిమాండ్ పెరిగింది. వారంతా ఇప్పుడు భారీ మొత్తంలో ప్యాకేజీ డిమాండ్ తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అందరి లక్షం ఒకటే అయినా తమదైన శైలిలో ప్రజల్లో ఉండేందుకు ప్రణాళికాబద్దంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని స్మార్ట్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఐవిఆర్‌ఎస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు చేస్తున్నారు. “నమస్తే… నేను మీ అభ్యర్థిని…అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా…మీ విలువైన ఓటును వినియోగించుకుని నన్ను గెలిపించాలని కోరుతున్నా” అంటూ అభ్యర్థుల గొంతుతో ఓటర్లకు ఫోన్ కాల్స్ చేయిస్తున్నారు.