తమిళ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ త్రిషకు క్షమాపణలు చెప్పారు. త్రిషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం.. అది రోజురోజుకు మరింత పెద్దదిగా అవుతుండడంతో మన్సూర్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇటీవల హీరో విజయ్, త్రిష కలసి నటించిన లియో సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.
ఇందులో మన్సూర్ అలీ ఖాన్ కూడా నటించారు. ఈ సినిమా గురించి ఇటీవల ఆయన మాట్లాడుతూ త్రిషతో సినిమా అనగానే, తాను త్రిషను ఎత్తుకుని బెడ్రూమ్ లోకి తీసుకువెళ్లే సీన్లు ఉంటాయనుకున్నాననీ, కానీ అలాంటివేమీ లేవంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. దీనిపై త్రిష మండిపడింది. ఇలాంటివాళ్లవల్లే మానవజాతికి కళంకం వస్తోందని పోస్ట్ పెట్టారు. దీంతో త్రిషకు మద్దతుగా ఖుష్బూ, మాళవిక, రోజా, చిరంజీవి తదితరులు నిలిచారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్… మనసూర్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు పంపారు. దీనిపై మన్సూర్, చెన్నై సెషన్స్ కోర్టును ఆశ్రయించి.. ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
అయితే, శుక్రవారం తన మందస్తు బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న మన్సూర్.. త్రిషకు క్షమాపణలు చెప్పారు. తాను కత్తి లేకుండా వారం రోజులుగా యుద్ధం చేశానని… ఈ యుద్ధంలో రక్తపాతం లేకుండానే తాను గెలిచానని అన్నారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాని తెలిపారు. తన వ్యాఖ్యలు నటి త్రిషకు బాధ కలిగించాయని.. అందుకు క్షమాపణ చెబుతున్నాని మన్సూర్ పేర్కొన్నారు.