Sunday, January 19, 2025

హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరంగా చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణీ కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. వాహనాల తనిఖీల్లో బైక్‌లను కూడా వదలకుండా పోలీసులు ఇరవై నాలుగు గంటలు తనిఖీలు చేస్తూ నగదును సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు అక్రమంగా నగదు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని డబ్బులను సీజ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడగానే రంగంలోకి దిగిన ముగ్గురు పోలీస్ కమిషనర్లు తమ కమిషనరేట్ పరిధిలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక్కడ వాహనాలను తనిఖీ చేస్తుండడంతో భారీ ఎత్తున నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు రూ.62,84,99,310 కోట్ల నగదు పట్టుకున్నారు. వీటిని తరిలిస్తున్న వారు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసి ఐటి అధికారులకు అప్పగించారు. నగదు తరలిస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు 841 కేసులు నమోదు చేశారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు 24 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చెక్‌పోస్టుల్లో కేంద్రబలగాలతోపాటు స్థానిక పోలీసులు కూడా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొయినాబాద్‌లో రూ.6కోట్లు, కొండాపూర్ రాక్‌గార్డెన్ వద్ద రూ.5కోట్లను, నార్సింగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.5కోట్లను పోలీసులు వాహనాల తనిఖీల సమయంలో సీజ్ చేశారు. నగదును తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. నగదుకు సంబందించిన ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసి ఇన్‌కంట్యాక్స్ అధికారులకు అప్పగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బంగారం 132.941కిలోలు, వెండి 185.255 కిలోలు, డైమండ్స్ 49.68గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. మద్యం ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో 291408.292 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసులు నగదు తరలిస్తున్న 633 మందిపై కేసు నమోదు చేసి రూ.55,19,72,340 నగదును సీజ్ చేశారు.

ఆన్‌లైన్ లావాదేవీలపై నజర్….
ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీ కాకుండా ఆన్‌లైన్‌లో జరగుతున్న లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన డబ్బులుగా భావిస్తున్న రూ.8కోట్లను పట్టుకున్నారు. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ఓ సెక్యూరిటీ సంస్థలకు బదిలీ అయిన దానిపై సైఫాబాద్ పోలీసులు బ్యాంకులో తనిఖీలు నిర్వహించారు. వెంటనే బ్యాంక్‌ఖాతాను ఫ్రీజ్ చేసి ఐటి అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఐటి, ఈడి అధికారులు తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News