Sunday, January 19, 2025

కేంద్ర మంత్రులు వచ్చేది… గెలిపించడానికా, ఓడించడానికా?

- Advertisement -
- Advertisement -

అవగాహన లేక నోరుజారుతున్న కేంద్రమంత్రులు
పార్టీకి డ్యామేజ్ అవుతున్న కేంద్రమంత్రుల వ్యాఖ్యలు
కేంద్రమంత్రులు వస్తున్నారంటే హడలెత్తిపోతున్న బిజెపి నేతలు
తెలంగాణలో పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనేనన్న పీయూష్‌ గోయల్
పోటీలో బిజెపి లేదని చెప్పకనే చెప్పిన గోయల్
మీటర్లు పెట్టనందుకే డబ్బులివ్వలేదన్న నిర్మల
కేంద్ర మంత్రుల మాటలపై ఉతికిఆరేస్తున్న బిఆర్‌ఎస్

మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారంటేనే ఇక్కడున్న బిజెపి నేతలు హడలిపోతున్నారు. అసలు కేంద్ర మంత్రులు ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అభ్యర్ధులను “గెలిపించడానికి వస్తున్నారా… లేక ఓడించడానికి వస్తున్నారా?”… అనే అనుమానాలు కలుగుతున్నాయని పలువురు సీనియర్ నాయకులు ఆందోళనతో వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ప్రజల తెలివితేటలను తక్కువగా అంచనా వేస్తూ నోరుజారడం పరిపాటిగా మారిందని కమలం పార్టీ నాయకులు కేంద్ర మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.

కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేసి ఎన్నికల బరిలో సర్వశక్తులూ వొడ్డి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అష్టకష్టాలూ పడుతుంటే,  ఎన్నికల ప్రచారానికి వస్తున్న కేంద్ర మంత్రులు, జాతీయ మీడియాకు ఇంటర్వూలు ఇచ్చే సమయంలో రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతూ తెలంగాణలో పార్టీకి నష్టం కలిగించే విధంగా నోరుజారుతున్నారని ఆ నాయకులు వాపోతున్నారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి తాము ఎక్కడా ఎదురుదాడి చేయడంలేదని, అదే కాంగ్రెస్ పార్టీలోనైతే ఈ పాటికి కేంద్ర మంత్రులకు గట్టిగా ఎదురు సమాధానం చెప్పి ఉండేవారని ఆ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మొన్నటికి మొన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఒక జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ఉత్తరాదిలోని నాలుగు రాష్ట్రాల్లో బిజెపి గెలుస్తుందని, దక్షిణాదిలోని తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని చెప్పిన మాటలు దుమారం రేపాయని, గోయల్ మాటలకున్న అర్థం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పోటీలో లేదని చెప్పకనే చెప్పారనే విషయం ఈపాటికే తెలంగాణలోని మారుమూల పల్లెలకు చేరిందని ఆ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అసలే బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎక్కడ… ఏ చిన్న అవకాశం దొరికినా తూర్పారబట్టడంలోనూ, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఎంతో పరిణతి చెందిన నాయకులున్నారని, ఆ రెండు ప్రత్యర్ధి పార్టీలకు బిజెపిపైన దాడిచేసేందుకు తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రులే అద్భుతమైన అవకాశాలు ఇస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యల నుంచి బయటపడే లోపునే కేంద్ర ఆర్ధికశాఖామంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పంటపొలాల్లో బోరుబావుల వద్ద విద్యుత్తు మీటర్లు పెట్టనందుకే తెలంగాణ ప్రభుత్వానికి నిధుల విడుదలలో కోతలు పెట్టామని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను 0.5 శాతం తగ్గించామని, ఆ మేరకు తెలంగాణకు గడచిన అయిదేళ్ళల్లో 25 వేల కోట్ల రూపాయల నిధులు తగ్గాయని చెప్పిన మాటలపై అధికార బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మూకుమ్మడిగా ధ్వజమెత్తారని కమలం పార్టీ నాయకులు తలలుపట్టుకొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆర్ధికమంత్రి టి.హరీష్‌రావు, మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటి.రామారావులే కాకుండా ఎన్నికల ప్రచారంలో ఉన్న ఇతర మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్ధులు సైతం నిర్మలమ్మ చెప్పిన అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకొంటున్నారని ఆ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అంతేగాక బిజెపి అభ్యర్ధులు గెలుస్తారనుకునే నియోజకవర్గాల్లోని నాయకులైతే కేంద్ర మంత్రులపైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని తెలిపారు.

దీనికితోడు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో బోరుబావుల వద్ద మీటర్లు పెట్టమని, రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ బోరుబాయిలకాడ మీటర్లు పెట్టే ప్రసక్తేలేదని, కేంద్రం ఎంత తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేసినా, ఎన్ని వేల కోట్లనైనా నష్టపరిచినా వెనకడుగు వేసేది లేదని, కేంద్రంలోని బిజెపి పాలకుల బెదిరింపులకు లొంగేది లేదని చెబుతున్న మాటలకు సభలకు హాజరవుతున్న జనం కెసిఆర్‌కు జేజేలు పలుకుతున్నారని, ప్రజల్లో కెసిఆర్ పట్ల, బిఆర్‌ఎస్ పార్టీ పట్ల మరింతగా గౌరవం పెరిగిందని, అందుకు కారణం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలేనని ఆ నాయకులు అంటున్నారు.

రాష్ట్ర ఆర్ధికశాఖా మంత్రి టి.హరీష్‌రావు అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారని, ఇప్పటి వరకూ “బాయిలకాడ మీటర్లు పెట్టమని తాము చెబుతుంటే ఎంతమంది నమ్మారో…ఎంత మంది నమ్మలేదో… మాకు తెలియదు కానీ… ఇప్పుడు నిర్మలమ్మ చెప్పడంతో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధుల నెత్తిన పాలు పోసినట్లయ్యిందని” మంత్రి హరీష్‌రావు రాజకీయంగా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారని రాష్ట్ర బిజెపి నాయకులు వివరించారు. బాయిలకాడ కరెంటు మీటర్లు పెట్టాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వత్తిడి తెచ్చిందని, ఇక్కడి అధికార బిఆర్‌ఎస్ ప్రభుత్వం గట్టిగా నిలబడి మీటర్లు పెట్టడానికి తిరస్కరించిన వైనం మారుమూల పల్లెలకు కూడా చేరిందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్న బిజెపి కేడర్‌ను రైతుల నుంచి, రైతు కూలీల నుంచి మాత్రమే కాకుండా చివరకు వృద్ధ మహిళలు సైతం నిలదీసి అడుగుతున్నారని వివరించారు. ఒకవైపు గ్యాస్ బండ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు బిజెపికి ప్రతికూల అంశాలుగా ఉంటూ వస్తున్నాయని, మరోవైపు బాయిలకాడ కరెంటు మీటర్లు పెట్టాలని తాము వొత్తిడి చేసినట్లుగా తామే అంగీకరించిన అంశాలు తప్పకుండా పార్టీకి నష్టాన్నే కలిగిస్తాయని ఆ నాయకులు వాపోతున్నారు.

ఇప్పటికే తమ పార్టీ తరుపున ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులు కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేశారని, వారందరూ ఫోన్లు చేసి “అన్నా… కేంద్రమంత్రి ఏమిటీ ఇలా మాట్లాడారు” అని అడుగుతుంటే సమాధానాలు చెప్పలేక నరకయాతనను అనుభవిస్తున్నామని ఆ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక “ఎంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అయినా… రోజులు మారాయని, కార్యకర్తలకు ఖర్చులు పెరిగాయని, సానుభూతి పరులు కూడా సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లకు కూడా డబ్బులు అడుగుతున్నారని, ముఖ్యంగా బైకులకు పెట్రోల్ ఖర్చులకే వేలాది రూపాయలను ఇవ్వాల్సి వస్తోందని, మెజారిటీ అభ్యర్ధులు ఈపాటికే కోట్లాది రూపాయలను ఖర్చు చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రమంత్రులు నోరుజారడంతో పార్టీకి, బరిలో ఉన్న అభ్యర్ధులకు ఎంతటి నష్టం కలుగుతుందో మీరే అర్ధంచేసుకోవాలని ఆ నాయకులు తీవ్ర ఆవేదనతో వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News